‘నారీ నారీ నడుమ మురారి’ ఇటు హీరో శర్వానంద్‌కు, అటు నిర్మాత అనిల్ సుంకరకు ఎంతో కీలకమైన చిత్రం. శర్వా నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. మరోవైపు అనిల్.. మహాసముద్రం, ఏజెంట్, భోళా శంకర్ లాంటి డిజాస్టర్లతో కుదేలయ్యారు. ఇలాంటి సమయంలో ‘నారీ నారీ నడుమ మురారి’ మీద చాలా ఆశలు పెట్టుకున్నారిద్దరూ. సంక్రాంతికి పెద్దగా ప్రచారం లేకుండానే విడుదలైన ఈ చిత్రం.. వారి ఆశలను నిలబెడుతూ సినిమా సూపర్ హిట్ అయింది.
ఈ నేపథ్యంలో శర్వా, అనిల్ అమితానందానికి గురయ్యారు. ‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్ మీట్లో ఇద్దరూ ఎంతో ఉద్వేగంతో మాట్లాడారు. ముఖ్యంగా శర్వా మాట్లాడుతూ.. తన కంటే కూడా అనిల్‌కు ఈ సక్సెస్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఆయనతో ఇక ముందూ తన ప్రయాణం కొనసాగుతుందని.. అనిల్‌తో చేసే తర్వాతి సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేస్తానని చెప్పడం విశేషం.
‘‘ఈ సినిమా విజయం మొత్తానికి కారణమైన వ్యక్తి అనిల్ గారు. కానీ ఆయన్ని అనిల్ గారు అనేకంటే అన్నగారు అని పిలవాలనిపిస్తుంది. ఆయనకు థ్యాంక్స్ అని చెబితే అది చాలా చిన్న పదం అవుతుంది. థ్యాంక్స్ చెప్పి ఇక్కడితో రుణం తీర్చుకోదలుచుకోలేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను. హీరో, ప్రొడ్యూసర్ కలిసి ఉంటే ఎలా ఉంటుంది అన్నది మేం చూపిస్తాం. ఈ రోజు హామీ ఇస్తున్నా. తర్వాతి సినిమాకు రూపాయి కూడా అడగను. మళ్లీ అనిల్ గారు పెద్ద సినిమాలు చేసే వరకు నేను రూపాయి కూడా తీసుకోను. ఈ విషయంలో ప్రామిస్ చేస్తున్నా’’ అంటూ అనిల్‌ను కౌగిలించుకున్నాడు శర్వా.
తాను ఏడేళ్ల నుంచి కష్టపడుతున్నామని, హిట్టు విలువ ఏంటో తమకు తెలుసని.. ఆ హిట్టు తనకు అనిల్ ఇచ్చారని శర్వా వ్యాఖ్యానించాడు. దీనికి బదులుగా అనిల్.. మీరే నాకు హిట్ ఇచ్చారనడంతో అందరం, అందరికీ ఇచ్చామని వర్వా అన్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ‘నారీ నారీ నడుమ మురారి’లో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.
#Sharwanand's PROMISE :
— Gulte (@GulteOfficial) January 22, 2026
"ఒక Hero – Producer కలిసి ఉంటే ఏమవుతుందో మేము చూపిస్తాం.
I Promise You Today… Next సినిమాకు రూపాయి కూడా అడగను.
మళ్లీ మా #AnilSunkara గారు పెద్ద సినిమాలు చేసే వరకు నేను రూపాయి కూడా తీసుకోను."#NariNariNadumaMurari pic.twitter.com/xl1eB8j7ez
Gulte Telugu Telugu Political and Movie News Updates