ఈ సంక్రాంతికి ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాయి తెలుగులో. ఆ ఐదూ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినవే. సంక్రాంతి సీజన్‌ను ప్రతి సినిమా బాగానే ఉపయోగించుకుంది. ఐతే ఇప్పుడు సెలవులు పూర్తయ్యాయి. డ్రై డేస్ మొదలైపోయాయి. దీంతో కలెక్షన్ల మీద ప్రభావం పడింది. ఆదివారం వరకు కళకళలాడిన థియేటర్లలో.. తర్వాతి రోజు సందడి తగ్గింది.
సంక్రాంతి సినిమాల్లో ముందుగా రేసులోకి వచ్చిన ప్రభాస్ చిత్రం ‘రాజాసాబ్’ మూడో సోమవారం బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డ సంకేతాలు కనిపిస్తున్నాయి. పండుగ సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువగా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం ఇదే. ఐతే ప్రభాస్ స్టార్ పవర్ వల్ల సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సంక్రాంతి సెలవుల అడ్వాంటేజీ వల్ల తర్వాత కూడా వసూళ్లు ఓ మోస్తరుగా వచ్చాయి.
చిరు సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవర్ ఫ్లోస్ కూడా కలిసొచ్చి ‘రాజాసాబ్’కు రెండో వీకెండ్లోనూ కలెక్షన్లు బాగానే ఉన్నాయి. కానీ ఈ సోమవారం మాత్రం వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. ఈ రోజు కూడా పరిస్థితి మెరుగ్గా ఏమీ లేదు. వరల్డ్ వైడ్ షేర్ నామమాత్రంగానే ఉంటోంది. దాదాపుగా ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ ముగింపు దశకు వచ్చినట్లే.
ఇతర భాషల్లో ‘రాజాసాబ్’ రన్ ఆల్రెడీ పూర్తయింది. తెలుగు వరకు మాత్రమే సినిమా హోల్డ్ చేయగలిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా పట్టు జారినట్లే. ఈ వీకెండ్లో కొత్త సినిమాలు లేకపోయినా సరే.. ‘రాజాసాబ్’ పుంజుకునే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
రవితేజ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’కి కూడా వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. చిరు సినిమా మాత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడుతోంది. అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలకు కూడా స్పందన బాగుంది. ఈ వీకెండ్‌ను ఈ మూడు చిత్రాలూ బాగా ఉపయోగించుకునేలా ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates