స్వయంభు మళ్లీ వెనక్కి…?

ఒకప్పుడు చిన్న స్థాయి హీరోగా ఉన్న నిఖిల్ ‘కార్తికేయ-2’ సినిమాతో మిడ్ రేంజికి ఎదిగాడు. పాన్ ఇండియా స్థాయిలో అతడికి ఫాలోయింగ్ వచ్చింది. కానీ దానికి ఫాలో అప్‌గా అతను సరైన సినిమాలు చేయలేదు. ‘18 పేజెస్’ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. ‘స్పై’, ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ డిజాస్టర్లయ్యాయి. దీనికి తోడు కెరీర్లో చాలా గ్యాప్ వచ్చేయడంతో సినీ అభిమానుల చర్చల్లో లేకుండా పోయాడు నిఖిల్. 

ఐతే నిఖిల్ కొత్త సినిమా ‘స్వయంభు’ మాత్రం చాలా ప్రామిసింగ్‌గా కనిపించింది. రెండు నెలల కిందట లాంచ్ చేసిన మేకింగ్ వీడియో సినిమా మీద అంచనాలను పెంచింది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయినప్పటికీ.. ఆ గ్లింప్స్‌లో విజువల్స్ చూశాక సినిమాకు బాగానే బజ్ క్రియేట్ అయింది. ఆ వీడియోలో ఫిబ్రవరి 13 అంటూ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు.

కానీ తాజా సమాచారం ప్రకారం ‘స్వయంభు’ ఫిబ్రవరి 13న రిలీజ్ కావట్లేదు. విడుదలకు ఇంకో 20 రోజులే సమయం ఉండగా.. టీం నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కావాల్సిన సినిమా నుంచి ఈపాటికే వరుస అప్‌డేట్స్ రావాల్సింది. ప్రమోషన్లు కూడా మొదలు కావాల్సింది. కానీ అలాంటి సంకేతాలేమీ లేవు. కాబట్టి సినిమా వాయిదా పడినట్లే. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. 

మార్చి నెలాఖరులో లేదా ఏప్రిల్ ప్రథమార్ధంలో సినిమాను రిలీజ్ చేయడంపై దృష్టిసారించిందట చిత్ర బృందం. ఆ డేట్ మీద ఒక క్లారిటీ వచ్చాక వాయిదా గురించి, అలాగే కొత్త విడుదల తేదీ గురించి ఒకేసారి ప్రకటన చేస్తారు.

సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు ప్రొడక్షన్లో కోలీవుడ్‌కు చెందిన కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి రూపొందించిన చిత్రమిది. ‘బాహుబలి’ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ దీనికి ఛాయాగ్రహణం అందించడం విశేషం. నిఖిల్ సరసన ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్ నటించారు.