గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనువు చాలించి దాదాపు మూడు నెలలు కావస్తోంది. దేశంలోనే అత్యంత గొప్ప గాయకుల్లో ఒకడిగా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించిన ఈ దిగ్గజానికి నివాళిగా మన వాళ్లు ఏం చేశారు అంటే.. సమాధానం కనిపించదు. కనీసం తెలుగు సినీ పరిశ్రమ తరఫున ఒక సంతాప సభ కూడా ఏర్పాటు చేయలేదు.
బాలు చనిపోయినపుడు కరోనా సాకు చూపి ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. ఇక సంగీత రంగం నుంచి బాలుకు ట్రిబ్యూట్‌గా ప్రత్యేకంగా ఏదీ చేసినట్లు కూడా కనిపించలేదు. మహా అయితే వివిధ కార్యక్రమాల్లో నివాళులు అర్పించారంతే. కానీ తమిళ జనాలు బాలును తమ వాడిని చేసుకుని ఎప్పటికప్పుడు కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తే కడుపు నిండకుండా పోదు.
బాలు అనారోగ్యం పాలై, మృత్యువుతో పోరాడినపుడు తమిళులు ఎంతగా తపించిపోయారో అందరూ చూశారు. ఇక ఆయన చనిపోయినపుడు కూడా అక్కడి జనాలు తల్లడిల్లిపోయారు. ఆయన మరణానంతరం చెన్నైలో అనేక సంతాప సభలు జరిగాయి. పరిశ్రమ తరఫున కార్యక్రమాలు నిర్వహించారు. అంతే కాక బాలుకు నివాళిగా మ్యూజికల్ వీడియోలు కూడా వస్తూనే ఉన్నాయి.
తాజాగా ప్రముఖ గాయకులు శ్రీనివాస్, హరిచరణ్‌లతో పాటు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తదితరులు కలిసి బాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్ సాంగ్ అంజలీ అంజలీని అనుకరిస్తూ మదన్ కార్కీ రాసిన ఓ పాటను గానం చేశారు. దానికి అందమైన విజువల్స్ కూడా జోడించారు. అది చూస్తే బాలు అభిమానుల మనసు ఉప్పొంగకుండా ఉండదు. బాలు మీద తమిళుల ప్రేమ ఎలాంటిదో, ఆయన్ని వాళ్లెంతగా ఆరాధిస్తారో ఇలాంటి వీడియోలు చూస్తే అర్థమవుతుంది. మన దిగ్గజం మీద ఇలాంటి ప్రేమ మనవాళ్లకు ఎందుకు లేకపోయిందనేదే ప్రశ్న.