టైసన్ నాయుడుకి మోక్షం దొరికేదెలా

అల్లుడు అదుర్స్ తర్వాత ఛత్రపతి హిందీ రీమేక్ కోసం చాలా గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ గత ఏడాది భైరవంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది ఆశించిన ఫలితం అందుకోకపోయినా, అనుకున్న దాని కన్నా ఎక్కువగా కిష్కిందపురి వర్కవుట్ అయ్యింది.

అయితే ఈ రెండు సినిమాల కన్నా ముందు ఎప్పుడో రిలీజ్ కావాల్సిన టైసన్ నాయుడు మాత్రం ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా లేట్ అవుతూనే ఉంది. భీమ్లా నాయక్ తర్వాత సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన మూవీ ఇదే. చిన్న టీజర్ అప్పుడెప్పుడో వదిలారు కానీ దాన్ని అభిమానులు కూడా మర్చిపోయి ఉంటారు.

సమస్య ఎక్కడ వచ్చిందంటే టైసన్ నాయుడు నిర్మాతలు 14 రీల్స్ తమ పెట్టుబడినంతా అప్పో సొప్పో చేసి అఖండ తాండవం 2 మీద పెట్టారు. అది బ్లాక్ బస్టర్ అయితే దాని మీద వచ్చే లాభాలను పెట్టుబడిగా తీసుకుని సాయి శ్రీనివాస్ సినిమా పూర్తి చేయాలని అనుకున్నారట.

తీరా చూస్తే అఖండ 2 అంచనాలు చేరుకోవడంలో ఫెయిలయ్యింది. బాలయ్య బోయపాటి శీను మేజిక్ రిపీట్ చేయలేదు. అసలే ఆర్థిక ఇబ్బందుల వల్ల విపరీతమైన ఒత్తిడితో వారం ఆలస్యంగా రిలీజైన అఖండ 2కి బాక్సాఫీస్ ఫలితం నిరాశ కలిగించడంతో టైసన్ నాయుడు మీద మళ్ళీ సందిగ్ధం నెలకొంది.

చూస్తుంటే టైసన్ నాయుడుకి అసలు మోక్షం దక్కుతుందా లేదానే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే మూడేళ్ళకు పైగా సమయం గడిచిపోయింది. జరిగిన షూటింగ్ కి పెద్దగానే ఖర్చు పెట్టారు. కానీ ఈలోగా అనుకోని ట్విస్టులు వచ్చి పడ్డాయి.

సాయిశ్రీనివాస్ కు బలమైన మాస్ హిట్ అవసరం చాలా ఉంది. కిష్కిందపురి తన బ్రాండ్ మీద, యాక్టింగ్ మీద సక్సెస్ అయిన సినిమా కాదు. హారర్ జానర్ తో దర్శకుడు కౌశిక్ చేసిన ఎక్స్ పరిమెంట్ వల్ల క్లిక్ అయ్యింది. సో టైసన్ నాయుడు వచ్చి హిట్టు కొడితే బెల్లం హీరోకి రిలీఫ్ దక్కేది. పండక్కు కూడా అప్డేట్స్ ఇవ్వలేదు. దీనికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చడం విశేషం.