ఒక హిట్ సినిమాకు సీక్వెల్ తీస్తున్నపుడు బడ్జెట్ పెరగడం సహజమే. కానీ ఆ బడ్జెట్ మరీ 15 రెట్లు పెరగడం అంటే అనూహ్యమే. అందులోనూ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించని సినిమాకు సీక్వెల్ తీస్తూ.. బడ్జెట్‌ను 14-15 రెట్లు పెంచారంటే అదొక సంచలనం అనే చెప్పాలి. తరుణ్ భాస్కర్ కొత్త సినిమా ఈ నగరానికి ఏమైంది-2 విషయంలో ఇదే జరిగిందని అంటున్నాడు నిర్మాత సృజన్ యరబోలు.
35:చిన్న కథ కాదు చిత్రంతో సృజన్ నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నాడు. అతను ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది-2 చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. విశ్వక్సేన్ సహా ఈ నగరానికి ఏమైందిలో కీలక పాత్రలు పోషించిన ముఖ్య నటీనటులందరూ ఈ సినిమాలోనూ కొనసాగుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.
ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బడ్జెట్ గురించి ఆశ్చర్యకర విషయం చెప్పాడు సృజన్. ఈ నగరానికి ఏమైందితో పోలిస్తే బడ్జెట్ పెరిగిందా అని అడిగితే.. ఏకంగా 14, 15 రెట్లు అయిందని వెల్లడించాడు సృజన్. ఈ నగరానికి ఏమైంది థియేటర్లలో అనుకున్నంతగా ఆడలేదు కానీ.. ఓటీటీలోకి వచ్చాక దానికి మాంచి ఫాలోయింగ్ వచ్చింది. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది.
రెండేళ్ల ముందు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఫస్ట్ రిలీజ్ టైంలో కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేయగానే బంపర్ క్రేజ్ వచ్చింది. ఈసారి సినిమాను లావిష్‌గా తీస్తున్నట్లు సృజన్ తెలిపాడు. ఈఎన్ఈ గ్యాంగ్ అంతా మరోసారి సినిమా తీయడం కోసం పడే కష్టాల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని.. ఆ గ్యాంగ్ అల్లరి అలా ఇలా ఉండదని సృజన్ చెప్పాడు.
ఈ సినిమాలో భారీగా విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని.. అందుకే బడ్జెట్ పెరిగిందని అతను తెలిపాడు. ఈ సినిమాకు మంచి బజ్ ఉన్నప్పటికీ డిజిటల్ రైట్స్ అమ్మకంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పాడు సృజన్. ఓటీటీలను సంప్రదిస్తే తమ దగ్గర స్లాట్స్ లేవని అంటున్నారంటూ.. డిజిటల్ మార్కెట్ డౌన్ అయిన విషయాన్ని గుర్తు చేశాడు సృజన్.
Gulte Telugu Telugu Political and Movie News Updates