టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో వెనుకబడి ఉన్న నారా రోహిత్ ఆ మధ్య భైరవంలో చెప్పుకోదగ్గ పాత్ర చేశాడు కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. సుందరకాండలో హీరోగా ఒక డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తే అదీ ఆదరణకు నోచుకోలేదు.
గతంలో ఒక ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ పుష్పలో ఫహద్ ఫాసిల్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ తనకే వచ్చిందని, కాకపోతే పలు కారణాల వల్ల మిస్ అయ్యానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ చేసి ఉంటే రోహిత్ కి అది ఇంకోలా బ్రేక్ ఇచ్చి ఇతర భాషల్లోనూ ఆఫర్లు తీసుకొచ్చేదేమో. అది ఫాహద్ ఫాసిల్ పేరు మీద రాసి పెట్టినప్పుడు ఎవరైనా ఏం చేయగలరు.
ఇక అసలు విషయానికి వస్తే వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబంలో నెగటివ్ టచ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రను నారా రోహిత్ చేస్తున్నట్టు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ యూనిట్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం విశ్వసనీయంగా ఉంది.
అంటే పుష్పలో మిస్సయిన విలన్ పోలీస్ వేషం ఇప్పుడు ఆదర్శ కుటుంబంలో దొరికిందన్న మాట. ఎంటర్ టైన్మెంట్, క్రైమ్ రెండు మిక్స్ చేసిన ఒక ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ ని త్రివిక్రమ్ తీస్తున్నారట. అందులో రోహిత్ చేస్తున్న క్యారెక్టర్ చాలా ప్రాధాన్యం ఉన్నట్టుగా చెబుతున్నారు.
ఇది కనక సక్సెస్ అయితే రోహిత్ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ చూడొచ్చు. ప్రస్తుతం కీలక షెడ్యూల్ లో ఉన్న ఆదర్శ కుటుంబంని వేసవి విడుదలకు రెడీ చేస్తున్నారు. వేగంగా తీస్తున్నా సరే క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా బెస్ట్ ఎంటర్ టైనర్ అయితే వస్తుందట.
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు డైలాగ్ రైటర్ గా వాటి విజయంలో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్ దశాబ్దాల తర్వాత వెంకటేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. దీని తర్వాత తారక్ తో ప్యాన్ ఇండియా మూవీ ప్లానింగ్ లో ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా విడుదల చేసుకుంటే ఆ ప్రాజెక్టుకి మార్గం సుగమం అవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
