ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్ లాంటి చిన్న సినిమాలతో సంచలనం సృష్టించి.. ఆపై నానితో చేసిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో మిడ్ రేంజ్ దర్శకుడిగా ఎదిగాడు మారుతి. చాలా ఏళ్ల పాటు ఆ రేంజిలోనే ఉన్న మారుతికి ‘రాజాసాబ్’ రూపంలో చాలా పెద్ద ఛాన్సే వచ్చింది. ఇండియాలో నంబర్ వన్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌తో మారుతి రేంజ్ డైరెక్టర్ సినిమా చేయడం అంటే అనూహ్యమే. కానీ ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
సంక్రాంతి కానుకగా విడుదలైన ‘రాజాసాబ్’ అంచనాలను అందుకోలేకపోయింది. ఫ్లాపుల్లో ఉన్న మారుతిని నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇస్తే అతను దాన్ని వృథా చేశాడంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తనపై ఫైర్ అయ్యారు. ఐతే ‘రాజాసాబ్’ అంచనాలను అందుకోలేదు కానీ.. బాక్సాఫీస్ దగ్గర మరీ పూర్‌గా ఏమీ పెర్ఫామ్ చేయలేదు. సంక్రాంతి సీజన్ అడ్వాంటేజీతో ‘రాజాసాబ్’ ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది. ఇది మారుతితో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కొంత ఉపశమనాన్ని ఇచ్చే విషయమే.
కానీ ‘రాజాసాబ్’ తర్వాత మారుతి మళ్లీ ఓ పెద్ద అవకాశం అందుకోగలడా అన్నది మాత్రం సందేహమే. ప్రస్తుతం పెద్ద హీరోలందరూ బిజీగా ఉన్నారు. పైగా ‘రాజాసాబ్’ సినిమా చూశాక మారుతిని నమ్ముతారా అన్నది అనుమానం. ఐతే మారుతి కూడా మళ్లీ పెద్ద సినిమానే చేయాలనే నియమం ఏమీ పెట్టుకోలేదని తెలుస్తోంది. నిజానికి ‘రాజాసాబ్’ ప్రమోషన్లలోనే తనకు మళ్లీ ఇలాంటి పెద్ద సినిమానే చేయాలనేమీ లేదని.. మళ్లీ మీడియం బడ్జెట్లో ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం లేకపోలేదని సంకేతాలు ఇచ్చాడు మారుతి.
ఇప్పుడు ‘రాజాసాబ్’ రిజల్ట్ చూశాక మారుతికి పెద్ద హీరో, బడ్జెట్ దొరకడం కష్టమని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో మళ్లీ తన బలానికి తగ్గట్లు మిడ్ రేంజిలో ఒక కామెడీ ఎంటర్టైనర్ తీయాలని అతను ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక లైన్ కూడా రెడీ అయిందని.. దాన్ని పూర్తి స్క్రిప్టుగా మలిచి తనకు ఏ హీరోతో కుదిరితే ఆ హీరోతో సినిమా చేయాలని అతను చూస్తున్నాడట. ‘రాజాసాబ్’ హడావుడి తగ్గింది కాబట్టి.. త్వరలోనే మారుతి కొత్త సినిమాపై ప్రకటన రావచ్చని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
