మెగా ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. భారీ డిజాస్టర్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఓజితో, చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారుతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాక నెక్స్ట్ రామ్ చరణ్ పెద్ది కోసం ఎదురు చూస్తున్నారు. దీని ఇన్ సైడ్ టాక్ కనక నిజమైతే మరో ఇండస్ట్రీ హిట్ రాబోతున్నట్టే.
ఈ క్రమంలో ఇతర మెగా హీరోలు కూడా సక్సెస్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళలో వరుణ్ తేజ్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. హ్యాట్రిక్ డిజాస్టర్లతో తన ఇమేజ్, మార్కెట్ రెండూ రిస్క్ లో పెట్టుకున్న ఈ మెగా ప్రిన్స్ త్వరలో కొరియన్ కనకరాజుగా రాబోతున్నాడు. ఇవాళ క్యారెక్టర్ పరిచయం చేస్తూ టీజర్ వదిలారు.
కథేంటో చెప్పలేదు కానీ చిన్న క్లూ ఇచ్చారు. కొరియా దేశంలో ఇరుకున్న సత్యను కనకరాజు జాడ చెప్పమని అక్కడి పోలీసులు తీవ్రంగా వేధిస్తూ ఉంటారు. ఊహించని విధంగా కత్తి పట్టుకుని కనకరాజు అక్కడికి వచ్చి రక్తపాతం సృష్టిస్తాడు. దెయ్యం లాంటి కళ్ళతో అందరినీ భయపెడతాడు.
తీరా చూస్తే అతను ఒరిజినల్ కాదని సత్య గుర్తిస్తాడు. దానికి ముందు వెనుకా ఏం జరిగిందనేది ట్రైలర్ వస్తే కానీ చెప్పలేం. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ కామెడీ హారర్ కు తమన్ సంగీతం సమకూర్చారు. విజువల్స్ సింపుల్ గా ఉన్నాయి కానీ బిజిఎం భయపెట్టేలా సాగింది.
ఇండియన్ దెయ్యాలు ఆత్మలు బోర్ కొట్టేశాయి కాబట్టి ఇప్పుడు కొరియన్ వైపు వెళ్ళిపోయింది కనకరాజు టీమ్. మిరాయ్ ఫేమ్ రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది. ఇదే యువి నిర్మిస్తున్న విశ్వంభర వ్యవహారం ఒక కొలిక్కి వచ్చాక కనకరాజుకి ముహూర్తం ఫిక్స్ చేయొచ్చు.
పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న కొరియన్ కనకరాజులో కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని యూనిట్ టాక్. గద్దలకొండ గణేష్ తర్వాత మాస్ ని పక్కన పెట్టేసిన వరుణ్ తేజ్ తిరిగి పెదనాన్న, బాబాయ్ రూటుకు వచ్చేశాడు. మరి తను కోరుకున్న విజయం దక్కుతుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
