తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత పెంచుకున్నాడు. నాగార్జున ఊపిరిలో నటించడానికి కారణం ఇక్కడ గుర్తింపుని మరింత మెరుగు పరుచుకోవడమే. అయితే ఆ తర్వాత వరస ఫ్లాపులు మార్కెట్ ని బాగా తగ్గించేశాయి.
ఇప్పుడు తన డబ్బింగ్ మూవీ వస్తోందంటే ఎగబడి పోటీ పడే నిర్మాతలు ఎక్కువ లేరు. కార్తీ కొత్త మూవీ వా వతియార్ ఇవాళ పొంగల్ పండగ సందర్భంగా విడుదలయ్యింది. జన నాయకుడు వాయిదాని వాడుకునే ఉద్దేశంతో ఆఘమేఘాల మీద ఆర్ధిక వివాదాలను నిర్మాత జ్ఞానవేల్ రాజా పరిష్కరించుకున్నారు.
నిజానికది గత డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సింది. అన్నగారు వస్తారు టైటిల్ తో ప్రమోషన్లు చేసి, కార్తీతో ఇంటర్వ్యూలు ఇప్పించి ఆన్ లైన్ లో టికెట్లు కూడా అమ్మారు. చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పుడు థియేటర్ల కొరత కారణంగా సమాంతరంగా ఏపీ తెలంగాణలో రిలీజ్ చేయలేదు.
తమిళ రివ్యూస్, పబ్లిక్ టాక్ చూస్తే మూవీ లవర్స్ మద్దతు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. లెజెండరీ నటులు ఎంజిఆర్ రిఫరెన్స్ వాడుకుని దర్శకుడు నలన్ కుమారస్వామి డిఫరెంట్ గా ట్రై చేశాడు. కానీ ఎంజిఆర్ మీద అవగాహన లేని ఇప్పటి జనరేషన్ ఎలా రిసీవ్ చేసుకుంటుదనే అనుమానాలు కోలీవుడ్ వర్గాల్లో లేకపోలేదు.
ఇక అసలు విషయానికి వస్తే కార్తీ ఇప్పుడు రాకుండా మంచి పనే చేశాడు. ఎందుకంటే మన శంకరవరప్రసాద్ గారు ర్యాంపేజ్ ఓ రేంజ్ లో ఉంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారిలు ఉన్నంతలో బాగానే లాకొచ్చేలా ఉన్నాయి. రాజా సాబ్ ఫలితం తేలిపోయినా ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.
చిరంజీవి సినిమాకు థియేటర్లు చాలక రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో మిడ్ నైట్ షోలు వేస్తున్నారు. ఇలాంటి టైట్ సిచువేషన్ లో అన్నగారు వస్తారు ఉంటే కనక కార్తితో పాటు దాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లకూ ఇబ్బందయ్యేది. వచ్చే వారం రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates