ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి, రామబాణం లాంటి సినిమాల్లో నటించిన ఆమెకు కోరుకున్న విజయం దక్కలేదు.. అంతకుముందు గల్ఫ్, దేవి-2 లాంటి చిత్రాల్లో చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఐతే ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఐటెం సాంగ్‌తో పాపులారిటీ వచ్చాక డింపుల్‌కు అవకాశాలైతే బాగానే వస్తున్నాయి.
తన పేరు, లుక్స్ చూస్తే పరభాషా కథానాయిక అనుకుంటాం కానీ.. ఆమె అచ్చమైన తెలుగమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆమెకు పెద్ద ఫిలిం బ్యాగ్రౌండ్ ఉన్న సంగతి కూడా బయటపెట్టలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ సంగతే వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది డింపుల్.
లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావుకు డింపుల్ హయతి మనవరాలు అవుతుందట. ఇంకో విశేషం ఏంటంటే.. పాత తరం నటి ప్రభ.. డింపుల్‌కు స్వయంగా నానమ్మ అట. ఇంకా తన ఫ్యామిలీలో చాలామంది నటులు ఉన్నట్లు ఆమె వెల్లడించింది.
ఐతే బ్యాగ్రౌండ్ చూపించి కాకుండా.. తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలనే డింపుల్ ఇన్ని రోజులు ఈ విషయాలను బయట పెట్టలేదని అనిపిస్తోంది. బహుశా ఇండస్ట్రీ జనాలకు కొంతమేర తన బ్యాగ్రౌండ్ గురించి తెలిసి ఉండొచ్చు.
డింపుల్ సినిమా కుటుంబానికి చెందిన అమ్మాయే అయినప్పటికీ.. ఆమె సినీ రంగంలోకి వస్తానంటే వద్దనే అన్నారట కుటుంబ సభ్యులు. కానీ తన ఆసక్తి చూసి తర్వాత తనకు వాళ్లందరూ సపోర్ట్ చేసినట్లు ఆమె వెల్లడించింది.
గ్లామర్ తారగా గుర్తింపు సంపాదించిన డింపుల్.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లోనూ సూపర్ సెక్సీగా కనిపిస్తోంది. అంతే కాక ఈ చిత్రం నటిగానూ తనకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తోంది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో కన్నడ భామ ఆషికా రంగనాథ్ మరో కథానాయికగా నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ మంగళవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates