ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు పక్కనపెడితే ఏపీ తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లు జనాలతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ జీవో ఇష్యూ వల్ల ప్రీమియర్లు వేయాల్సిన రాత్రి పెద్ద రాద్దాంతమే జరిగింది. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడంతో ఫ్యాన్స్ అసహనానికి గురయ్యారు.
హైదరాబాద్ విమల్ థియేటర్ లో జరిగిన తొక్కిడి మాములుగా లేదు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ లో చెప్పిన టైంకి రాత్రి తొమ్మిది గంటలకు ఆటలు మొదలుపెట్టేశారు. మెయిన్ సెంటర్స్ లో టికెట్ వెయ్యి రూపాయలైనా ఫ్యాన్స్ లెక్క చేయలేదు.
రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు మొదలుకాబోతున్న నేపథ్యంలో రాజా సాబ్ కు పెద్ద వీకెండ్ ఎదురు చూస్తోంది. ప్రభాస్ ని ఖచ్చితంగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయాలనుకునేవాళ్ళు మొదట డార్లింగ్ కే ప్రాధాన్యం ఇస్తారు. మన శంకరవరప్రసాద్ గారుకి ఇంకో మూడు రోజులు టైం ఉంది కాబట్టి రాజా సాబ్ కు సోలో గ్రౌండ్ ఉంది.
పెంచిన టికెట్ రేట్ల పట్ల నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి కానీ సూపర్ పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల మీద దీని ప్రభావం పెద్దగా ఉండదు. అయితే రాజా సాబ్ కు ఆన్ లైన్ లో వచ్చిన స్పందన మిశ్రమంగా ఉండటంతో ఒకటి రెండు రోజులు వేచి చూడాలి.
తన క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ప్రభాస్ మరోసారి ఋజువు చేశాడు. బుక్ మై షోలో సగటున నలభై వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం దానికి నిదర్శనం. ఈ జోరు పది రోజులు కొనసాగిస్తే పెంచిన రేట్లతో బ్రేక్ ఈవెన్ అందుకోవచ్చు. కానీ ఎప్పటిలాగా ప్రభాస్ ఈసారి సోలోగా లేడు.
పోటీలో చిరంజీవి, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి సినిమాలున్నాయి. ఫెస్టివల్ సీజన్ కాబట్టి కుటుంబ ప్రేక్షకులు దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనే దాన్ని బట్టి కమర్షియల్ స్కేల్ ఆధారపడి ఉంటుంది. నార్త్ లో ఇంకా పికప్ అవ్వాల్సి ఉండగా జన నాయకుడు వాయిదా తమిళనాడులో రాజా సాబ్ కు ఎంత ప్లస్ అయ్యిందో రేపటికి క్లారిటీ వస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates