మూడేళ్లు వెనక్కి వెళ్తే.. తమిళ సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో మొదలైన ఓ సినిమాకు ముందు ఓకే చెప్పి, తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్సేన్ బయటికి రావడం మీద పెద్ద వివాదమే నడిచింది. దీని మీద అర్జున్ హైదరాబాద్‌కు వచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశాడు. తర్వాత తాను ఏ స్థితిలో ఆ సినిమా నుంచి బయటికి రావాల్సి వచ్చిందో విశ్వక్ వివరణ ఇచ్చాడు.
కొన్నిరోజుల తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. అర్జున్ ఒక దశలో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్లు కనిపించాడు. కానీ తర్వాత ఆయన దాన్ని పట్టాలెక్కించాడు. ఆ చిత్రమే.. సీతాపయనం. ఇందులో అర్జున్ తనయురాలు ఐశ్వర్య కథానాయికగా నటించగా.. నిరంజన్ సుధి అనే కన్నడ కుర్ర హీరో ఇందులో లీడ్ రోల్ చేశాడు. అర్జున్‌తో పాటు అతడి మేనల్లుడు ధ్రువ్ సర్జా, ప్రకాష్ రాజ్, సత్యరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చింది టీం.
ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే కానుకగా సీతాపయనం ప్రేక్షకుల ముందుకు రానుంది. విశేషం ఏంటంటే.. అంతకు ఒక్క రోజు ముందే విశ్వక్ కొత్త చిత్రం ఫంకీ కూడా రిలీజ్ కాబోతోంది. ముందు ఏప్రిల్ తొలి వారంలో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను.. తర్వాత ప్రి పోన్ చేసింది టీం. ఫిబ్రవరి 13న రిలీజ్ అని నెల ముందే ప్రకటించారు. ఇప్పుడు అర్జున్ సినిమాకు అదే వీకెండ్లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
విశ్వక్ సినిమా అప్పుడే వస్తుందని తెలిసే..జనాలకు నాటి కాంట్రవర్శీ గుర్తుకు వచ్చి ప్రమోషన్ల పరంగా ఉపయోగపడుతుందని అనుకున్నారో.. లేక విశ్వక్ మీద బాక్సాఫీస్ విజయం సాధించాలన్న ఉద్దేశంతో అర్జున్ ఇలా ప్లాన్ చేశాడో కానీ.. ఈ క్లాష్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. రెండు చిత్రాలూ ఇదే డేట్లకు కట్టుబడితే రిలీజ్ టైంలో ఈ రెండు చిత్ర బృందాలకు పాత కాంట్రవర్శీ గురించి మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవడం ఖాయం. అప్పుడు విశ్వక్, అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates