రాజాసాబ్‌కు జాక్‌పాట్!

ప్ర‌భాస్ హీరోగా మారుతి రూపొందించిన రాజాసాబ్ డిసెంబ‌రు 5నే రిలీజ్ కావాల్సింది. కానీ సంక్రాంతి సీజ‌న్ అయితే బాగుంటుంద‌ని ఈ నెల 9కి సినిమాను వాయిదా వేశారు. కానీ పండ‌క్కి తెలుగు నుంచి మ‌రో నాలుగు సినిమాలు బ‌రిలో ఉండ‌డం.. త‌మిళం నుంచి జ‌న‌నాయ‌కుడు సినిమా వ‌స్తుండ‌డంతో ఈ చిత్రానికి థియేట‌ర్ల స‌మ‌స్య త‌ప్ప‌లేదు.

జ‌న‌నాయ‌కుడు సినిమాకు తెలుగులో కూడా భారీగా స్క్రీన్లు ఇచ్చారు. మ‌రోవైపు త‌మిళ‌నాడు స‌హా ద‌క్షిణాదిన మిగ‌తా అన్ని రాష్ట్రాల్లోనూ జ‌న‌నాయగ‌న్ భారీగా రిలీజ‌వ‌డంతో ప్ర‌భాస్ సినిమాకు కొంతమేరకు ఇబ్బందిగా మారింది. ఓవ‌ర్సీస్‌లో కూడా ఇదే ప‌రిస్థితి. ఐతే ఇప్పుడు విజ‌య్ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అనుకోని అడ్డంకులు ఎదుర‌య్యాయి. వ్య‌వ‌హారం కోర్టుకు చేరింది. అక్క‌డా స‌త్వ‌ర ఉప‌శ‌మ‌నం ద‌క్కట్లేదు.

ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తుంటే జ‌న‌వ‌రి 9న జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ‌వ‌డం క‌ష్టంగానే ఉంది. కోర్టు తీర్పును బ‌ట్టి కొత్త డేట్ ఖ‌రార‌వుతుంది.

ఈ వీకెండ్లో జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ కాక‌పోతే రాజాసాబ్ జాక్ పాట్ కొట్టిన‌ట్లే. వ‌ర‌ల్డ్ వైడ్ సోలోగా సినిమా రిలీజ‌వుతుంది. తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌నాయ‌గ‌న్ కోసం అట్టిపెట్టిన స్క్రీన్లు కూడా ప్ర‌భాస్ సినిమాకే ద‌క్కుతాయి. దీని కంటే సంతోషించాల్సిన విష‌యం ఏంటంటే.. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌లో రాజాసాబ్‌కు పోటీనే ఉండ‌దు. కావాల్సిన‌న్ని స్క్రీన్లు ఇస్తారు.

ఉత్త‌రాదిన కూడా వ‌సూళ్ల పంట పండించుకోవ‌డానికి అవ‌కాశ‌ముంటుంది. ఓవ‌ర్సీస్‌లోనూ రాజాసాబ్‌కు ఎదురే ఉండ‌దు. ముందు అనుకున్న దాని కంటే ఓపెనింగ్స్ భారీగా ఉండ‌డం ఖాయం. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. తొలి వీకెండ్లోనే బ‌య్య‌ర్లు పెట్టుబ‌డిలో చాలా వ‌ర‌కు వెన‌క్కి రాబ‌ట్టుకోవ‌డానికి అవకాశ‌ముంటుంది.

డిసెంబ‌రులో రాజాసాబ్ రిలీజై ఉంటే.. దురంధ‌ర్ దెబ్బ దానిపై గ‌ట్టిగానే ప‌డేది. ఇప్పుడు సంక్రాంతి పండ‌క్కి తోడు.. పోటీలేని బాక్సాఫీస్ ఆ సినిమాకు బాగా క‌లిసొచ్చేదే. మ‌రి ఈ అడ్వాంటేజీని ప్ర‌భాస్-మారుతి ఏమేర స‌ద్వినియోగం చేసుకుంటారో చూడాలి.