మొత్తానికి అఖండ-2 సినిమా థియేట్రికల్ రన్ ముగిసినట్లే. తొలి రోజు ఈ సినిమాకు వచ్చిన టాక్, ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్లలో డ్రాప్ చూసి సినిమా పెద్ద డిజాస్టర్ కాబోతోందని అంతా అనుకున్నారు. కానీ సినిమా పుంజుకుంది. తర్వాతి మూడు వీకెండ్స్‌లో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. వీక్ డేస్‌లో కలెక్షన్లు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ.. వారాంతాల్లో మాత్రం ఈ సినిమాకు చెప్పుకోగ్గ స్థాయిలోనే షేర్ వచ్చింది. అయినా కూడా దాదాపు అన్ని ఏరియాల్లోనూ నష్టాల భారం తప్పలేదు కానీ అనుకున్నంత స్థాయిలో లేదన్నది ట్రేడ్ లెక్కలు చెబుతున్న మాట.
‘అఖండ-2’ బయ్యర్లందరూ సేఫ్ జోన్లోకి వచ్చారని, ఇది హిట్ మూవీ అని చెప్పలేం. కానీ మొదట్లో వచ్చిన టాక్, డ్రాప్ చూసి నష్టాలు భారీగా ఉంటాయన్న అంచనాలు అయితే నిజం కాలేదు. నైజాం ఏరియాలో ‘అఖండ-2’ దాదాపుగా బ్రేక్ ఈవెన్ మార్కును అందుకుంది. రాయలసీమలో కూడా సినిమా బ్రేక్ ఈవెన్‌కు కొంచెం దగ్గరగా వెళ్లింది. ఆంధ్రలో కొన్ని ఏరియాల్లో స్వల్ప నష్టాలు వచ్చాయి. కొన్ని ఏరియాల్లో నష్టాలు 30 శాతానికి అటు ఇటుగా వచ్చాయి. యుఎస్‌లో సినిమా అనుకున్నంత మేర వసూళ్లు రాబట్టలేకపోయింది.
‘అఖండ-2’కు లాంగ్ రన్ ఉండడం వల్ల బయ్యర్లు వేచి చూశారు. ఇప్పుడు రన్ ముగిసేసరికి చూస్తే కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. సగం ఏరియాల్లో నష్టాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. మిగతా ఏరియాల్లో స్వల్ప నష్టాలతో బయ్యర్లు బయటపడ్డారు. రిలీజ్ టైంలో నిర్మాతలు ఎంత నరకయాతన అనుభవించారో తెలిసిందే.
ఒక వారం సినిమా వాయిదా పడడం.. అప్పటికప్పుడు ఈరోస్ వాళ్లకు సెటిల్మెంట్ చేయాల్సి రావడం.. మరోవైపు బయ్యర్లతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి రేట్లు రివైజ్ కావడం.. చివరికి రివైజ్ చేసిన మేరకు కూడా డబ్బులు కట్టకపోవడంతో 14 రీల్స్ ప్లస్ అధినేతలకు తీవ్ర ఇబ్బంది తప్పలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates