బ్రేక్ తీసుకోండి డైరెక్టర్ సాబ్

దర్శకుడు మారుతీ మంచి ఒత్తిడిలో ఉన్నారు. ది రాజా సాబ్ విడుదల తేదీ సంవత్సరాలు, నెలల నుంచి కౌంట్ డౌన్ ఇప్పుడు రోజుల్లోకి వచ్చేసింది. జనవరి 9 కోసం అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. ఒకపక్క చివరి దశ పనులు చూసుకుంటూనే ప్రమోషన్లు మిస్ కాకూడదనే ఉద్దేశంతో మారుతీ వరసబెట్టి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు.

ఈ క్రమంగా తాను చెప్పాలనుకున్నది ఒకటి, బయటికి వస్తున్నది మరొకటి తరహాలో అర్థాలు మారిపోవడంతో ఫ్యాన్స్ కొంత కినుక వహిస్తున్నారు. డైరెక్టర్ సాబ్ కొంచెం రెస్ట్ తీసుకోండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడిన క్లిప్పులను వైరల్ చేస్తున్నారు.

ఏఐకి గ్రాఫిక్స్ కు ఉన్న తేడా, ప్రభాస్ డూపుని వాడుకునే విధానం, క్లైమాక్స్ ఘట్టం, హీరోకు తాను ఇచ్చిన ప్రాధాన్యత ఇలా పలు విషయాల గురించి మారుతీ పంచుకున్న ముచ్చట్లలో కొన్ని మిస్ ఫైర్ అయ్యాయి. ముఖ్యంగా నేను ప్రభాస్ చెప్పినట్టే చేశాను, కోరినట్టే తీశాను అని చెప్పడం కొంత నెగటివ్ సెన్స్ లోకి వెళ్తోంది.

అంత ఇమేజ్ ఉన్న డార్లింగ్ నా మాట నమ్మి ఓకే చేసేంతగా తీశానని చెప్పుకుంటే ఎలివేషన్ అవుతుంది. అలా కాకుండా అంతా ప్రభాస్ మీదకు చెప్పడం కొందరికి రుచించడం లేదు. ఫ్లాప్ ట్రాక్ లో ఉన్నా తనకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన ప్రభాస్ మీద మారుతీకి చాలా కృతజ్ఞత ఉంది. అది ఈవెంట్ లో బయటపడింది కూడా.

కానీ సోషల్ మీడియా జమానాలో ఏ చిన్న పొరపాటు మాట దొర్లినా యాంటీ ఫ్యాన్స్ దాన్ని పట్టేసుకుంటారు. అదే ప్రభాస్ అభిమానులకు సంకటంగా మారింది. అసలే మారుతీ మీడియా ముందుకు వచ్చి సంవత్సరాలు గడిచిపోయాయి. పక్కా కమర్షియల్ తర్వాత మళ్ళీ కెమెరాని ఫేస్ చేయలేదు.

ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ విడుదల సమయంలో ఎలాంటి దర్శకుడికైనా కొంత నెర్వస్ నెస్ ఉంటుంది. కానీ అది మాటల్లో బయటపడితే ఒక్కోసారి ట్రోలింగ్ కి దారి తీయొచ్చు. అందుకే ముందు అవసరమైన మేరకు రెస్ట్ తీసుకుని, రిలీజయ్యాక బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు కాబట్టి అప్పుడు ఓపెనైతే బెటరేమో.