ఒక మారుతి… ఐదుగురు స్టార్ హీరోలు

తెలుగులో కామెడీ బాగా డీల్ చేయగల దర్శకుల్లో మారుతి ఒకడు. అతను తీసిన చిత్రాల్లో చాలా వరకు ఎంటర్టైనర్లే. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో అతను తెలుగు ప్రేక్షకులను ఎలా నవ్వుల్లో ముంచెత్తాడో తెలిసిందే. ప్రభాస్‌తో తీసిన ‘రాజాసాబ్’లో సైతం కామెడీ బాగానే ఉండబోతోందని ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. 

ఐతే కామెడీ ఒక పార్ట్‌గా కాకుండా.. కేవలం కామెడీనే ప్రధానంగా ఒక సినిమా తీయాలనేది తన కల అంటున్నాడు మారుతి. తెలుగులో ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌లకు తోడు.. కమల్‌ హాసన్‌ను పెట్టి ‘పంచతంత్రం’ లాంటి సినిమా తీయాలని ఉందని.. అందుకోసం సీరియస్‌గా ప్రయత్నం కూడా చేస్తానని అతను ఒక పాడ్ కాస్ట్‌లో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

‘‘నేను ఒక పంచతంత్రం లాంటి సినిమా తీస్తాను.. ఆ రోజు థియేటర్ బ్లాస్ట్ అవుతుంది. నాకు అలాంటి సినిమా రాసేంత కెపాసిటీ ఉంది. కంటెంట్  ఉంది. అలాంటిది నాకు చెయ్యాలనేది ఉంది. నాకు మల్టీస్టారర్ చేయాలని ఉంది. నలుగురు.. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, కమల్ హాసన్.. ఈ ఐదుగురితో కలిసి సినిమా చేయాలన్నది నా ఆలోచన. మనకింక ఆ సినిమా అలా ఉండిపోవాలి’’ అని మారుతి వ్యాఖ్యానించాడు. 

ఐతే మారుతి ఆలోచన బాగానే ఉంది కానీ.. ఈ కాంబినేషన్‌ను తెరపైకి తీసుకురావడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. తెలుగు సీనియర్ హీరోల్లో ఇద్దరిని కలిపి సినిమా తీయడం వరకు ఓకే కానీ.. నలుగురిని ఏకతాటిపైకి తేవడమే చాలా కష్టం.

అలాంటిది వీరికి తోడు కమల్ హాసన్ అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి మారుతి కల కలగానే మిగిలిపోక తప్పదేమో. కానీ ఆర్టిస్టులు ఎవరన్నది పక్కన పెడితే.. అతను ‘పంచతంత్రం’ లాంటి కామెడీ సినిమా చేస్తే మాత్రం వర్కవటువుతుందనడంలో సందేహం లేదు.