హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుతో హ్యాపీయే అంటున్న నిధి

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మొద‌లైన‌పుడు, ఫ‌స్ట్ టీజ‌ర్ రిలీజైన‌పుడు దానిపై అంచ‌నాలు మామూలుగా లేవు. ప‌వ‌న్ న‌టించిన తొలి చారిత్రక నేప‌థ్యం ఉన్న సినిమా కావ‌డం, క్రిష్ లాంటి విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించ‌డంతో ప‌వ‌న్ అభిమానులే కాక సామాన్య ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమాపై అమితాస‌క్తిని ప్ర‌ద‌ర్శించారు.

కానీ ఈ సినిమా బాగా ఆల‌స్యం కావ‌డం.. ఏళ్ల‌కు ఏళ్లు మేకింగ్‌లోనే ఉండిపోవ‌డం.. మ‌ధ్య‌లో ద‌ర్శ‌కుడు మార‌డం ప్ర‌తికూల‌మ‌య్యాయి. గ‌త ఏడాది రిలీజైన ఈ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చేదు అనుభ‌వం త‌ప్ప‌లేదు. ఈ సినిమాలో క‌థానాయిక‌గా ఎంపికైన‌పుడు నిధి అగ‌ర్వాల్ కెరీర్ మ‌రో స్థాయికి వెళ్తుంద‌ని అంతా అనుకున్నారు.

ఆమె కెరీర్లో అప్ప‌టికి అదే అతి పెద్ద సినిమా. ఎంతో ఓపిగ్గా ఈ సినిమా షూట్‌లో పాల్గొని, ప్ర‌మోషన్ల‌లోనూ చురుగ్గా వ్య‌వ‌హ‌రించిన నిధికి.. బాక్సాఫీస్ ఫ‌లితం నిరాశ క‌లిగించే ఉంటుందని అనుకుంటాం. కానీ ఆమె మాత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు త‌న కెరీర్‌కు మంచే చేసింద‌ని అంటోంది.
ఈ చిత్రంలో త‌న పాత్ర‌, న‌ట‌న‌కు వ‌చ్చిన స్పంద‌న ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేసింది నిధి అగ‌ర్వాల్.

ఆ సినిమా చూసి బ‌య‌టికి వ‌చ్చిన వాళ్లంద‌రూ.. తాను బాగా న‌టించాన‌నే ఫీడ్ బ్యాక్ ఇచ్చిన‌ట్లు ఆమె చెప్పింది. ఈ సినిమా త‌ర్వాత త‌న‌ను జ‌నం చూసే కోణం మారిందని ఆమె అంది. ఈ సినిమా త‌ర్వాత మంచి స్క్రిప్టులు వ‌స్తున్నాయా అని అడిగితే.. అవున‌ని ఆమె బ‌దులిచ్చింది. త‌న‌కు చాలా మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ని.. ముఖ్యంగా తెలుగు నుంచి మంచి క‌థ‌లు, పాత్ర‌లు ఆఫ‌ర్ చేస్తున్నార‌ని.. ప్ర‌స్తుతం తాను మూడు సినిమాల‌ను అంగీక‌రించాన‌ని ఆమె వెల్ల‌డించింది.

ఐతే ఆ వివ‌రాలు జ‌న‌వ‌రి 9న రాజాసాబ్ రిలీజ‌య్యాకే వాటి గురించి మాట్లాడ‌దామ‌ని.. ఆ వివ‌రాల‌ను వాటి మేక‌ర్సే అధికారికంగా వెల్ల‌డిస్తార‌ని నిధి చెప్పింది. బాలీవుడ్ మూవీ మున్నా మైకేల్‌తో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయిన నిధి.. ఆ త‌ర్వాత తెలుగులో స‌వ్యసాచి చేసింది. ఆపై వ‌రుస‌గా ఆమె తెలుగు చిత్రాల్లోనే న‌టిస్తోంది. త‌మిళంలో శింబు స‌ర‌స‌న ఈశ్వ‌ర‌న్ అనే సినిమాలోనూ నిధి న‌టించింది.