‘రాజాసాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు మారుతి ఎంత ఎమోషనల్ అయ్యాడో తెలిసిందే. ‘రాజాసాబ్’ ముందు వరకు మారుతి తీసినవన్నీ చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే. పైగా అతను ఫ్లాపుల్లో ఉన్నాడు. అలాంటి సమయంలో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకడైన ప్రభాస్ తనతో సినిమా చేయడానికి ముందుకు రావడం చిన్న విషయం కాదు.
ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ‘రాజాసాబ్’ కోసం అతను ప్రాణం పెట్టినట్లే కనిపిస్తోంది ప్రోమోలు చూస్తే. ఈ సినిమా విషయంలో మారుతి మామూలు కాన్ఫిడెంట్‌గా లేడు. ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నపుడు.. సినిమా ఒక్క శాతం కూడా నిరాశపరచనది చెబుతూ, తన ఇంటి అడ్రస్ వివరాలు చెప్పి, నిరాశ పడ్డ వాళ్లు తన ఇంటికి వచ్చి నిలదీయవచ్చని అన్నాడు.
ఐతే మారుతి ఒక పర్పస్‌తో తన ఇంటి అడ్రస్ చెబితే.. ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకో పని కోసం దాన్ని వాడేసుకున్నారు. ‘రాజాసాబ్’ ట్రైలర్ చూసి ఎంతో ఇంప్రెస్ అయిన రెబల్ ఫ్యాన్స్.. మారుతి మీద అభిమానంతో అతడికి బిరియానీలు పార్శిల్ పంపించారు. ఆ పార్శిల్స్ చూసి మారుతి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన మారుతి.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుని ప్రభాస్ అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు. వాళ్లకు తన వైపు నుంచి జనవరి 9న రివర్స్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నాడు.
‘రాజాసాబ్’ ఎక్స్ హ్యాండిల్లోనూ దీనిపై స్పందించారు. మారుతి ఇంటి అడ్రస్ ఇచ్చింది ఎందుకు.. మీరు దాన్ని ఎందుకోసం వాడారు అంటూ సరదా కామెంట్ పెట్టారు. తనతో పని చేసేవాళ్లకు కడుపు నిండా ఫుడ్డు పెట్టి చంపేస్తుంటాడని ప్రభాస్‌కు పేరుంది. మారుతికి బిరియానీలు పంపించడం చూస్తే.. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన కథానాయకుడికి ఏమాత్రం తీసిపోరంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates