సాయికుమార్ నట వారసత్వాన్నందుకుని ఎన్నో ఆశలతో టాలీవుడ్లోకి అడుగు పెట్టాడు ఆది సాయికుమార్. కానీ అరంగేట్రం చేసి దశాబ్దం కావస్తున్నా అతనింకా హీరోగా నిలదొక్కుకోలేదు. రొమాన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా రకరకాల జానర్లు ప్రయత్నించి విఫలమయ్యాడతను. కెరీర్ ఆరంభంలో అయినా ఆది సినిమాలు అంతో ఇంతో ఆడాయి కానీ.. గత కొన్నేళ్లలో అయితే అతడి చిత్రాలు వచ్చింది వెళ్లింది కూడా తెలియట్లేదు. చివరగా జోడి అనే సినిమాతో పలకరించాడతను. కొంచెం గ్యాప్ తర్వాత ఆది ఇప్పుడు జంగిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంతకుముందు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా హార్రర్ జానర్‌తో జనాల్ని భయపెట్టి వారి మనసులు గెలవాలని చూస్తున్నాడు ఆది.
కార్తీక్-విఘ్నేష్ అనే కొత్త దర్శకులు కలిసి రూపొందించిన చిత్రమిది. దీని టీజర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం భయపెట్టే విజువల్స్, వాయిస్ ఓవర్‌తో జంగిల్ టీజర్ వరకు అయితే పర్వాలేదనే అనిపిస్తోంది. టీజర్ చూసి కథ మీద ఒక అంచనాకు రావడం కష్టంగానే ఉంది కానీ.. విజువల్స్ అయితే బాగున్నాయి.
తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ సినిమాలో ఆద్యంతం కొనసాగేలా ఉంది. హీరో అని కాకుండా అన్ని పాత్రలనూ ఎలివేట్ చేసేలా టీజర్ సాగింది థియేటర్లో ఈ సినిమా చూసేవాళ్లు బాగానే భయపడటం ఖాయనిపిస్తోంది. ఆదికి జోడీగా నటించిన వేదికనే తన పక్కన కొంచెం పెద్దగా అనిపిస్తోంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండబోతోందని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. 2021 ఆరంభంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates