లక్కీ భాస్కర్ దర్శకుడి రిస్కీ సబ్జెక్ట్

సూర్య హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎంటర్ టైనర్ దాదాపు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇటీవలే మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ 45 ఏళ్ళ వ్యక్తికి, 20 ఏళ్ళ అమ్మాయికి మధ్య స్నేహం, ప్రేమ ఆధారంగా చాలా డిఫరెంట్ గా ఈ స్టోరీ ఉంటుందని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అయితే వెంకీ అట్లూరి అంతకు ముందు వేరే చోట మాట్లాడిన సందర్భంలో 1992లో వచ్చిన అనిల్ కపూర్ లమ్హే లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీ తీయాలని ఉందని చెప్పడం ఈ సందర్భంగా మళ్ళీ బయటికి వస్తోంది. అసలు ఇక్కడ రిస్క్ ఏంటో చూద్దాం.

చాందిని లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత దర్శక నిర్మాత యష్ చోప్రా లమ్హే తీశారు. దాదాపు తండ్రి వయసు ఉన్న హీరోతో చనిపోయిన హీరోయిన్ కూతురు ప్రేమలో పడటం అందులో మెయిన్ పాయింట్. శ్రీదేవి డ్యూయల్ రోల్ చేయగా ఇద్దరి ప్రేమను పొందే పాత్రలో అనిల్ కపూర్ కనిపిస్తారు. అప్పట్లో ఇది డిజాస్టర్. తర్వాత క్లాసిక్ అనిపించుకుంది కానీ కమర్షియల్ గా ఫెయిల్యూరే.

తల్లి శ్రీదేవిని ప్రేమించి అదే పోలికలతో ఉండే ఆమె కూతురు శ్రీదేవిని కూడా అనిల్ కపూర్ కే ముడిపెట్టడం ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు వెంకీ అట్లూరి తీసుకున్నది యధాతథంగా ఇదే పాయింట్ ఖచ్చితంగా అయ్యుండదు.

కాకపోతే కొంత సారూప్యత ఉండే అవకాశాన్ని కొట్టి పారేయలేం. అసలే తెలుగు ప్రేక్షకులు మహా సున్నితం. ఏ మాత్రం పాయింట్ బ్యాలన్స్ తప్పినా ఇంతే సంగతులు. వీటికన్నా ముందు 1984 లో మమ్ముట్టి నటించిన కనమరయతులో కొంచెం ఇదే తరహా బ్యాక్ డ్రాప్ ఉంటుంది. శోభన మెయిన్ లీడ్.

వీటన్నింటికి మూలం డాడీ లాంగ్ లెగ్స్ అనే ఇంగ్లీష్ నవల. సో వెంకీ అట్లూరి ఎంత కన్విన్సింగ్ గా సూర్య 46ని తీర్చిదిద్ది ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. సూర్య సన్నాఫ్ కృష్ణన్ లోనే వయసు మళ్ళిన తండ్రి పాత్ర చేసి మెప్పించిన సూర్యకి ఇప్పుడిదేమి టఫ్ క్యారెక్టర్ కాదు కాని ఆడియన్స్ కోణంలో ఒక రకంగా సవాలే.