సురేష్ బాబు ముందు పెను సవాళ్లున్నాయి

తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎంపికయ్యారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఏకంగా 31 మంది గెలుపొందడం విశేషం. మన ప్యానెల్ నుంచి కేవలం 17 అభ్యర్థులు విజయ బావుటా ఎగరేశారు. సరే ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ 2026లో సురేష్ బాబుకు ఎన్నో సవాళ్లు స్వాగతం పలకబోతున్నాయి.

ఎందుకంటే టాలీవుడ్ లో అంతా పైకి బాగానే జరుగుతున్నట్టు అనిపిస్తున్నా చాలా సమస్యలు తిష్ట వేసుకున్నాయి. గత ప్రెసిడెంట్లు వాటి పరిష్కారానికి ఎంత చొరవ తీసుకున్నారనేది పక్కన పెడితే రాబోయే రెండేళ్లలో సురేష్ బాబు లాంటి సీనియర్ ఎలాంటి మార్పులు తెస్తారనేది కీలకంగా మారింది.

యుఎఫ్ఓ, క్యూబ్ లాంటి సర్వీస్ ప్రొవైడర్ల చార్జీల గురించి అధిక శాతం నిర్మాతలు వ్యతిరేకంగా ఉన్నారు. ఎప్పటి నుంచో దీని గురించి పోరాడుతున్నా పరిష్కారం దొరకడం లేదు. పెద్ద సినిమాలకు టికెట్ రేట్ల పెంపు పెద్ద పంచాయితీగా మారిపోయింది. రెండు రాష్టాలలో విడివిడిగా అనుమతులు తీసుకోవడం సమస్యగా పరిణమించింది.

ఏపీలో ఇకపై కొత్త సిస్టమ్ తెస్తామని, పదే పదే జిఓలు ఇవ్వకుండా చూస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పగా, రాబోయే రోజుల్లో టికెట్ హైక్స్, స్పెషల్ షోలు ఉండవని తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవన్నీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత సురేష్ బాబు మీద ఉంటుంది.

తరచుగా రిలీజ్ డేట్ల వ్యవహారం కూడా క్లిష్టంగా మారుతోంది. ప్యాన్ ఇండియా సినిమాలు మాట మీద ఉండకుండా డేట్లు మార్చడం చిన్న చిత్రాలకు ప్రాణ సంకటంగా మారింది. దీని వల్ల కొన్ని మంచి తేదీలు వృథా అయిపోయి థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి.

వినోదపు పన్ను, కరెంట్ చార్జీల మీద కూడా ఏదైనా తగ్గింపు దొరికేలా ప్రభుత్వాలతో రాయబారం చేయాలని ఇండస్ట్రీ పెద్దలు ఆశిస్తున్నారు. ఇవన్నీ సురేష్ బాబు ఒంటి చేత్తో పరిష్కరిస్తారని కాదు కానీ ప్రయత్నం చేస్తే కొన్నింటికి ఫలితం వచ్చినా అది టాలీవుడ్ కు మేలే చేస్తుంది. అసలే ఛాంబర్ లో యువరక్తం తోడయ్యింది. వాళ్ళ సహకారం, సలహాలు చాలా అవసరం.