విజయ్ దేవరకొండ కెరీర్‌ను మళ్లీ ఒక మలుపు తిప్పే సినిమా అవుతుందని ‘కింగ్డమ్’ మీద తన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మళ్ళీ రావా, జెర్సీ లాంటి క్లాసిక్స్ తీసిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని రూపొందించడం.. వరుస విజయాల్లో ఉన్న నిర్మాత నాగవంశీ ప్రొడ్యూస్ చేయడం.. ప్రోమోలు వేరే లెవెల్లో కనిపించడం.. సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి.
కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. తర్వాత నిలబడలేక అంతిమంగా ఫ్లాప్ సినిమాగా మిగిలింది ‘కింగ్డమ్’. ఈ సినిమాకు ద్వితీయార్ధం పెద్ద మైనస్‌గా మారింది. ఫస్టాఫ్ వరకు ఓకే అనిపించే సినిమా.. సెకండాఫ్‌లో తీవ్ర నిరాశకు గురిచేసి చివరికి ప్రేక్షకులు నిట్టూర్పులతో బయటికి వచ్చేలా చేసింది.
ఐతే సెకండాఫ్‌లో సమస్య ఉందని తమకు ముందే తెలుసని.. దాన్ని మార్చడానికి ప్రయత్నం కూడా చేశామని.. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదని నాగవంశీ వెల్లడించాడు.
‘‘కింగ్డమ్ సెకండాఫ్‌లో సమస్య ఉందని నేను, మా బాబాయి గుర్తించాం. బాబాయి అయితే దీన్ని మార్చడం కోసం గౌతమ్‌తో మూడు నెలల పాటు పోరాడాడు. కానీ అతను జెర్సీ తీసిన దర్శకుడు. అతడికో కన్విక్షన్ ఉంటుంది. దాన్ని దాటి మనం ముందుకు వెళ్లలేం. ప్రేక్షకులు ఒకే రకం సినిమాలకు అలవాటు పడిపోయారని.. స్టీరియో టైప్ బ్రేక్ చేద్దాం అని అతను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు.
కొన్నిసార్లు ఇది తప్పు అని తెలిసినా కూడా.. మనం ఏమీ చేయలేని, మార్పు చేయలేని పరిస్థితి తలెత్తుతుంది. ‘కింగ్డమ్’ విషయంలో కూడా అదే జరుగుతుంది. దర్శకుడికి వదిలేసి ముందుకు వెళ్లిపోయాం’’ అని నాగవంశీ తెలిపాడు. మరోవైపు ‘జెర్సీ’ తర్వాత నానితో మళ్లీ తమ సంస్థలో ఒక సినిమా రాబోతోందని.. ఒక కథ మీద చర్చలు చివరి దశలో ఉన్నాయని.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లొచ్చని నాగవంశీ వెల్లడించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates