హాలీవుడ్ సినిమాల్లో కల్ట్ ఫాలోయింగ్ ఉన్న మూవీ అనకొండ. 1997లో విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ ప్రపంచంలోనే అత్యంత భారీ, పొడవైన పాముల మీద తీయడంతో అప్పటి ప్రేక్షకులు గుడ్లప్పగించి చూశారు. తెలుగు డబ్బింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారీ వసూళ్లు తీసుకొచ్చింది. కేవలం గంటన్నర నిడివితో ఆడియన్స్ ని పాములు భయపెట్టిన తీరు విరగబడి చూసేలా చేశాయి.
తర్వాత 2004లో ది హంట్ ఫర్ బ్లడ్ ఆర్కిడ్, 2008లో ఆఫ్ స్ప్రింగ్, 2009లో ట్రయల్ అఫ్ బ్లడ్, 2015లో లేక్ ప్లాసిడ్ అని మరో నాలుగు సినిమాలు ఈ సిరీస్ లో వచ్చాయి కానీ ఒరిజినల్ స్థాయిలో ఏవీ పెద్దగా మేజిక్ చేయలేదు. కాకపోతే కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి.
తాజాగా అనకొండ అసలు పేరుతో 2025 వర్షన్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా చేశారు. అయితే ఈసారి అనకొండ లవర్స్ కు నిరాశ తప్పదు. ఎందుకంటే హారర్ తో భయపెట్టడానికి బదులు దర్శకుడు టామ్ గోర్మికాన్ ఈసారి కామెడీ రూటు ఎంచుకున్నాడు. నిడివి పెరగలేదు కానీ ల్యాగ్ విపరీతంగా పెట్టేసి కిక్ లేని అనకొండ ఇచ్చారు.
కథ విషయానికి వస్తే అనకొండ వీర ఫ్యాన్స్ అయిన నలుగురు స్నేహితులు ఆ సినిమాని రీమేక్ చేద్దామని డమ్మీ పాముని తీసుకెళ్లి బ్రెజిల్ లో ఉన్న అమెజాన్ అడవులకు వెళ్తారు. కానీ అక్కడ నిజంగానే అనకొండలు వస్తాయి. ఆ తర్వాత జరిగే అల్లరి చిల్లర స్టోరీనే అనకొండ 2025.
కేవలం తొంభై నిమిషాలే ఉన్నప్పటికీ సుదీర్ఘమైన సంభాషణలు, అవసరం లేని కామెడీ ఎపిసోడ్లతో దర్శకుడు చాలా టైం వేస్ట్ చేశాడు. తీరా అసలైన అనకొండలు బయటికి వచ్చాక సీరియస్ టర్న్ తీసుకుంటుందని భావిస్తే అక్కడా పప్పులో కాలేసినట్టే.
చనిపోయాడని భావించిన పాత్రలను తిరిగి బ్రతికించడం ద్వారా ఫీలవ్వాల్సిన భయాన్ని కూడా హాస్యంగా మార్చేయడం తేడా కొట్టింది. విఎఫెక్స్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. కాకపోతే పాల్ రాడ్, జాక్ బ్లాక్ మధ్య కెమిస్ట్రీ కొంతమేర నవ్విస్తుంది. ఇది మినహాయించి అనకొండని అల్లరిపాలు చేయడం తప్పించి ఈ కొత్త పాము సాధించింది ఏమీ లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates