సాధారణంగా స్టార్ హీరోలు మేకప్ పరంగా మేకోవర్లు చేయడం గతంలో ఎన్నో చూశాం. భారతీయుడులో కమల్ హాసన్, ఐలో విక్రమ్, భైరవ ద్వీపంలో బాలకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వస్తాయి. కొన్నిసార్లు వయసుని లెక్క చేయకుండా ప్రయోగాలకు సిద్ధపడటం అభిమానులను భయపెట్టిన దాఖలాలున్నాయి. ఇప్పుడీ లిస్టులో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ చేరబోతున్నారు.
ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న తాయ్ కిళవి ఊర మాస్ పల్లెటూరి వృద్ధ మహిళగా ఆవిడ మారిపోయిన విధానం ఆడియన్స్ ని షాక్ కు గురి చేస్తోంది. శివకుమార్ మురుగేషన్ దర్శకత్వంలో ఈ విలేజ్ డ్రామా రూపొందింది.
నిజానికి అరవై మూడు వయసులో ఇంత రిస్క్ అవసరం లేదు. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా చాలా బిజీగా ఉండే రాధికా శరత్ కుమార్ ఇలాంటి ఎక్స్ పరిమెంట్స్ చేయడం ద్వారా సీనియర్లకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. ఎంతసేపూ వదిన, తల్లి, అత్తగారు పాత్రలకు పరిమితమవుతూ సేఫ్ గేమ్ ఆడుతున్న ఎందరికో ఆమె ఎగ్జాంపుల్ గా ఉండబోతున్నారు.
టీజర్ చూస్తే కథ మొత్తం రాధికా చుట్టే తిరిగేలా రాసుకున్నారు. ఎవరిని లెక్క చేయని ఒక ఒంటరి వృద్ధురాలి జీవితమే తాయ్ కిళవి. మాస్ ఎలిమెంట్స్ కి లోటు లేకుండా అన్ని అంశాలు ఉండేలా దర్శకుడు జాగ్రత్త పడిన వైనం కన్పిస్తోంది.
టైటిల్ కు అర్థం వయసైపోయిన తల్లి. ఒకటి ఒప్పుకోవాలి. ఇలాంటి రా అండ్ రిస్టిక్ కథలు టాలీవుడ్ లో చేయడానికి దర్శక నిర్మాతలు ఆలోచిస్తారు. కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి ఎందుకొచ్చిన గొడవలెమ్మని ఊరుకుంటారు. కానీ తమిళంలో ఈ తరహా కథలకు ఆదరణ ఉంటుంది.
డ్రామా, సెంటిమెంట్ ఎక్కువైనా సరే హిట్ చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. తాయ్ కిళవిలో ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరు లేరు. నివాస్ కె ప్రసన్న సంగీతం సమకూర్చగా అరుళ్ దాస్, బాల శరవణన్, మునీష్ కాంత్, ఇళవరసు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ వచ్చాక బిజినెస్ డిమాండ్ పెరిగిందట.
Gulte Telugu Telugu Political and Movie News Updates