పెద్ద ముప్పు తెచ్చి పెట్టనున్న దురంధర్ 2

నిన్నటిదాకా బాలీవుడ్ వర్గాల్లో వినిపించిన మాట దురంధర్ 2 విడుదల ముందు ప్రకటించినట్టు మార్చి 19 ఉండదని. కానీ ఇప్పుడు స్వరం మారిపోయింది. ఖచ్చితంగా అదే డేట్ కి వస్తున్నట్టు పలు వర్గాల ద్వారా టీమ్ కన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే వేరే సినిమాలకు ఇది పెద్ద ముప్పు కానుంది.

ఆ రోజు మరో రెండు ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. మొదటిది యష్ టాక్సిక్. ఇది కూడా వాయిదా వార్తలలో నలుగుతూ వస్తున్నా ఇటీవలే ఇచ్చిన యాడ్స్ తో ఎలాంటి మార్పు లేదని కుండ బద్దలు కొట్టింది. కియారా అద్వానీ ఫస్ట్ లుక్ పోస్టర్లోనూ స్పష్టంగా చెప్పేసింది.

అడివి శేష్ డెకాయిట్ మరో పెద్ద సినిమా. చాలా గ్యాప్ తర్వాత శేష్ వస్తున్నాడు. అది కూడా బాగా కష్టపడి హీరోయిన్ మార్చాల్సి వచ్చినా సరే రీ షూట్స్ కి వెనుకడుగు వేయకుండా మరీ సహకారం అందించాడు. దురంధర్ 2ని హిందీ రాష్ట్రాల్లో తట్టుకునే శక్తి డెకాయిట్ కు ఉండదు. డిస్ట్రిబ్యూటర్ల సహకారం కూడా ఆశించలేం.

ఆల్రెడీ డిసెంబర్ నుంచి మార్చికే షిఫ్ట్ అయిన డెకాయిట్ మరోసారి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నా ఆశ్చర్యం లేదు. ఇక అసలు ట్విస్టు వేరే ఉంది. కేవలం వారం గ్యాప్ లో రామ్ చరణ్ పెద్ది దిగుతుంది. దీని మీద చికిరి చికిరి పాట, టీజర్ పుణ్యమాని నేషన్ వైడ్ బజ్ వచ్చేసింది.

దురంధర్ 2 రెండో వారంలో ఉండగా పెద్ది దిగితే ఉత్తరాదిలో చరణ్ మూవీకి సమస్య అవుతుంది. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. నాని ప్యారడైజ్ వస్తాననే పంతంతోనే ఉంది. ఇది జరిగితే బిగ్గెస్ట్ క్లాష్ అని చెప్పొచ్చు. కేవలం పది రోజుల వ్యవధిలో నాలుగు మోస్ట్ వాంటెడ్ ప్యాన్ ఇండియా మూవీస్ పరస్పరం తలపడటం ఎంత మాత్రం సేఫ్ గేమ్ అనిపించుకోదు.

ఇంకా మూడు నెలలకు పైగా టైం ఉంది కాబట్టి ఈలోగా ఏమేం పరిణామాలు జరుగుతాయో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి. వీటి పట్ల మూవీ లవర్స్ ఎగ్జైట్ మెంట్ అయితే మాములుగా లేదు. వీటిలో రెండు తప్పుకుంటాయని బయ్యర్లు నమ్ముతున్నారు.