చిన్న సినిమాల వైపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి స్టేజ్ మీద బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం.. ఛాలెంజులు చేయడం ఇప్పుడు ప్రమోషన్లలో కొత్త ట్రెండ్. అంతిమంగా ఈ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనమా లేదా అన్నది పక్కన పెడితే.. వీటి వల్ల సినిమా సోషల్ మీడియా జనాల నోళ్లలో నానుతుందన్నది మాత్రం వాస్తవం.
కొత్తగా బన్నీ వాసు వర్క్స్ అని బేనర్ పెట్టి.. వంశీ నందిపాటితో కలిసి చిన్న సినిమాలను రిలీజ్ చేస్తూ మంచి ఫలితాలను అందుకుంటున్న బన్నీ వాసు కూడా యువ ప్రేక్షకులను కవ్వించేలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వంశీతో కలిసి తాను రిలీజ్ చేస్తున్న ‘ఈషా’ చిత్రానికి వచ్చే లవర్స్‌కు బాగా వర్కవుట్ అవుతుందని అన్నాడు. ఇందుకు ఆయనో ఆసక్తికరమైన లాజిక్ చెప్పారు.
గర్ల్ ఫ్రెండ్ భయస్థురాలైతే.. ‘ఈషా’ సినిమాలో హార్రర్ ఎలిమెంట్లకు కంగారు పడిపోయి తన బాయ్ ఫ్రెండ్ చేతిని గట్టిగా పట్టేసుకుంటుందని.. వాటేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని బన్నీ వాసు సరదాగా వ్యాఖ్యానించారు. లవర్స్‌కు ఈ రకంగా బాగా వర్కవుటయ్యేలా ఈ సినిమాలో చాలా సీన్లే ఉన్నాయని ఆయనన్నారు.
ఇక ఫ్రెండ్స్ బ్యాచ్‌లో తాము చాలా ధైర్యవంతులం.. హార్రర్ సినిమాలంటే అస్సలు భయమే లేదు అని బిల్డప్‌లు ఇచ్చే వాళ్లను.. వాళ్ల మిత్రులంతా కలిసి ఈ సినిమాకు తీసుకురావాలని బన్నీ వాసు అన్నారు. ‘ఈషా’ చూసి కూడా వాళ్లు కంగారు పడకుండా థియేటర్లో కుదురుగా కూర్చుంటే నిజంగానే ధైర్యవంతులని.. లేదంటే మాత్రం వాళ్ల అసలు రంగు బయటపడిపోతుందని బన్నీ వాసు అన్నారు. తమ బ్యాచ్‌లో ఇలా ఎక్కువ బిల్డప్ ఇచ్చే వ్యక్తిని తానే అంటూ వాసు తన మీద తనే సెటైర్ వేసుకోవడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates