ప్రొడ్యూసర్ డైరెక్ట్ చేస్తే ఇలానే ఉంటుంది

ఈ గురువారం ‘శంబాల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఆది సాయికుమార్. తన కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రం ఇదని అతను ఎంతో నమ్మకంగా ఉన్నాడు. కెరీర్ ఆరంభంలో ప్రేమకావాలి, లవ్లీ, గాలిపటం లాంటి చిత్రాలతో ప్రామిసింగ్‌గానే కనిపించిన ఆది కెరీర్.. ఆ తర్వాత డౌన్ అయిపోయింది. సరైన సినిమాలు చేయక అంతకంతకూ తన పరిధి కుచించుకుపోయింది.

ఒక దశలో ఆది సినిమాలు థియేటర్లలో రిలీజవ్వడమే గగనమైంది. రిలీజైనా ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయాయి చాలా చిత్రాలు. అలాంటి సినిమాల్లో ‘షణ్ముఖ’ కూడా ఒకటి. ఇది మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే అయినా.. దాన్ని సరిగా డీల్ చేయకపోవడం, టేకింగ్ తేలిపోవడంతో ప్రేక్షకుల నుంచి తిరస్కారం తప్పలేదు. ఆ చిత్రం అలా తయారవడానికి అసలు కారణమేంటో మా ప్రతినిధికి ఇచ్చిన ఎక్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆది వెల్లడించాడు.

‘‘దర్శకుడు షణ్ముఖ కథ చెప్పినపుడు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఒక వ్యక్తికి ఆరు ముఖాలుండడం మీద కాన్సెప్ట్‌ను దర్శకుడు బాగానే రాసుకున్నాడు. ఈ కథ విన్నపుడు నేనే కాదు.. హీరోయిన్ అవికా గోర్ కూడా ఎగ్జైట్ అయింది. ఐతే ఈ సినిమా 60 శాతం పూర్తయ్యాక బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది.

ఆ చిత్ర నిర్మాత సినిమాను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. దీంతో వేరే నిర్మాతకు అప్పగించాడు. ఆ నిర్మాత దీన్ని నేనే డైరెక్ట్ చేస్తా అని కండిషన్ పెట్టి మిగతా డబ్బులు పెట్టడానికి ముందుకు వచ్చాడు. నాకు అది కరెక్ట్ కాదు అనిపించినా.. వాళ్లు ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లడం, మిగతా సినిమా పూర్తి చేయాల్సిన కమిట్మెంట్ ఉండడంతో ఏమీ చేయలేకపోయాను.

సినిమా పూర్తి చేశాను. కానీ చేస్తున్నపుడే ఇది వర్కవుట్ కాదు అనిపించింది. విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఆషామాషీ విషయం కాదు. అనుకున్నట్లుగా ఔట్ పుట్ తీసుకురావడం అందరి వల్లా కాదు. ఆ విషయంలోనూ తేడా కొట్టి సినిమా అలా తయారైంది’’ అని ఆది వెల్లడించాడు. తన కొత్త చిత్రం ‘శంబాల’ విషయంలో ఇలాంటి తప్పులేమీ జరగలేదని, ఎక్కడా రాజీ పడకుండా పకడ్బందీగా సినిమాను తీర్చిదిద్దామని ఆది తెలిపాడు.