ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచడం కోసం వేరే భాషల నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం ఎప్పట్నుంచో ఉన్నదే. గత కొన్నేళ్లలో భాషల మధ్య హద్దులు మరింత చెరిగిపోయి.. సినిమా గ్లోబల్ అయిపోయిన నేపథ్యంలో ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకొస్తున్నారు. ఓటీటీల జోరు పెరిగాక మలయాళ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కనెక్షన్ పెరిగిన నేపథ్యంలో అక్కడి నుంచి కొత్త టాలెంట్‌ను తీసుకురావడం మరింత పెరిగింది.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కొత్త సినిమా రౌడీ జనార్దనకు పూర్తిగా కొత్త టెక్నికల్ సెటప్‌ను తీసుకొచ్చాడు దర్శకుడు రవికిరణ్ కోలా. ఈ సినిమాకు కొత్త బ్యాక్ డ్రాప్ తీసుకున్న రవికిరణ్.. విజువల్స్, మ్యూజిక్ సహా సాంకేతిక విభాగాలన్నింట్లోనూ కొత్తదనం చూపించడానికే ప్రయత్నిస్తున్నట్లున్నాడు. తెలుగు ప్రేక్షకులకు అలవాటైన ఏ టెక్నీషియన్ వైపూ చూడకుండా మనకు పరిచయం లేని ఇతర భాషల సాంకేతిక నిపుణులకే ఓటేశాడు రవికిరణ్.
రౌడీ జనార్దన టీజర్‌ను గమనిస్తే.. అందులో టెక్నీషియన్ల పేర్లన్నీ కొత్తగా ఉండడం గమనించవచ్చు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నాడు. అతడికిది తొలి తెలుగు సినిమా. మలయాళంలో మిన్నల్ మురళి, భీష్మ పర్వం, భ్రమయుగం లాంటి కల్ట్ మూవీస్‌కు సంగీతం అందించాడు క్రిస్టో. కన్నడలో అతను సంగీతం అందించిన 777 చార్లీ కూడా కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది.
రౌడీ జనార్దనకు ఛాయాగ్రహణం అందించిన ఆనంద్ సి.చంద్రన్ కూడా మలయాళ టెక్నీషియనే. అతను ప్రేమమ్, భీష్మపర్వం, ఆనందం లాంటి చిత్రాలతో గొప్ప పేరే సంపాదించాడు. ముఖ్యంగా ప్రేమమ్, భ్రమయుగం సినిమాలు చూసిన వాళ్లు తన ఛాయాగ్రహణ ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేరు.
రౌడీ జనార్దనకు ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్న డినో శంకర్ కూడా పేరున్న టెక్నీషియనే. అతను బాలీవుడ్లో డిటెక్టివ్ బ్యోంకేష్ భక్షి, వాజిర్ లాంటి సినిమాలకు పని చేశాడు. రౌడీ జనార్దన టీజర్ చూస్తే సౌండ్, విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్ అన్నీ కూడా టాప్ నాచ్ అనిపించాయి. తన అభిరుచికి తగ్గట్లుగా ఇతర భాషల నుంచి పేరున్న టెక్నీషియన్లను తెచ్చుకున్న రవికిరణ్.. వీరి సహకారంతో విజయ్‌కి మరపురాని సినిమాను అందిస్తాడేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates