టీనేజీలో ఉండగానే ‘నిర్మలా కాన్వెంట్’ అనే చిన్న సినిమా చేశాడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా. కానీ ఆ చిత్రం సరిగా ఆడలేదు. చాలా ఏళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ‘పెళ్లిసందడి’లో నటించాడు. ఆ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. హీరో హీరోయిన్లు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా మారి ఓ మాదిరిగా ఆడింది. ఇటు రోషన్‌కు, అటు శ్రీలీలకు మంచి పేరొచ్చింది. దీంతో ఇద్దరికీ అవకాశాలు వెల్లువెత్తాయి.
‘పెళ్ళిసందడి’ తర్వాత శ్రీలీల వరుసగా సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె తర్వాత దాదాపు పది చిత్రాల్లో నటించగా.. రోషన్ మాత్రం చాలా టైం తీసుకుని ఒకే ఒక్క సినిమాలో నటించాడు. అదే.. ఛాంపియన్. పేరొచ్చింది కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా మంచి చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని చూశాడు. వైజయంతీ వారి స్వప్న సినిమాలో ‘ఛాంపియన్’తో అతను రీఎంట్రీ ఇస్తున్నాడు.
రోషన్ లాంటి యంగ్ హీరో మీద స్వప్న సినిమా సంస్థ ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ పెట్టేసింది. నిజాం కాలంలో నడిచే కథ ఇది. నాటి వాతావరణాన్ని తెరపైకి తేవాలంటే బాగా ఖర్చవుతుంది. అయినా కథ మీద నమ్మకంతో ధైర్యంగా అడుగు వేశారు నిర్మాతలు.
టీజర్, ట్రైలర్ చూస్తే అంత ఖర్చు పెట్టడం వర్త్ అనే అనిపిస్తోంది. ఈ సినిమాలో కంటెంట్‌ను గుర్తించి ఒక ఓటీటీ సంస్థ రూ.16 కోట్లకు డిజిటల్ రైట్స్ తీసుకుందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ రోజుల్లో ఒక అప్ కమింగ్ హీరో సినిమాకు అంత రేటివ్వడం అనూహ్యమే. మిగతా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నాలుగైదు కోట్లు రావచ్చు.
థియేటర్ల నుంచి రూ.30 కోట్ల దాకా షేర్ రావాల్సి ఉంది. అంటే గ్రాస్ రూ.50 కోట్ల దాకా కలెక్ట్ చేయాలి. రోషన్ రేంజికి ఇది చాలా గట్టి టార్గెట్. పైగా క్రిస్మస్ వీకెండ్లో చాలా సినిమాల నుంచి పోటీ ఉంది. ఈ టార్గెట్ అందుకోవాలంటే సినిమాకు అదిరిపోయే టాక్ రావాలి. జనం కూడా రోషన్ సినిమా చూడడానికి అమితాసక్తిని ప్రదర్శించాలి. మొత్తానికి రోషన్‌కిది అతిపెద్ద ఛాలెంజ్ అవుతుందేమో అనిపిస్తోంది. మరి ‘ఛాంపియన్’తో బాక్సాఫీస్ హిట్టు కొట్టి హీరోగా నిలబడడమే కాక నిర్మాతలనూ రోషన్ కాపాడతాడేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates