ఈ వీకెండ్లో తెలుగు నుంచి క్రేజున్న సినిమాలేవీ లేవు. గుర్రం పాపిరెడ్డి తప్పితే నోటబుల్ సినిమాలేవీ రాలేదు. హాలీవుడ్ మూవీ అవతార్: ఫైర్ అండ్ యాష్ ఉండడంతో దానికి పోటీగా తెలుగు చిత్రాలను రిలీజ్ చేయడానికి భయపడ్డారు. వచ్చే వారం క్రిస్మస్ వీకెండ్ మీదే ఎక్కువ సినిమాలు ఫోకస్ పెట్టాయి. ఈ వారాన్ని అవతార్-3కే రాసిచ్చేసినట్లయింది. కానీ ఆ మూవీ అంచనాలకు తగ్గట్లు లేదు. మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి.
తొలి రోజు ఆక్యుపెన్సీలు ఒక మోస్తరుగా ఉన్నాయి. అవతార్-3కి మిశ్రమ స్పందన రావడం బాలయ్య సినిమా అఖండ-2కు బాగానే కలిసొచ్చింది. తొలి వీకెండ్ తర్వాత ఆ సినిమా వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. దీంతో థియేట్రికల్ రన్ ఎన్నో రోజులు కొనసాగదనిపించింది. అవతార్-3 వస్తుండడంతో అఖండ-2 ఏమేర వసూళ్లు రాబట్టగలదో అనుకున్నారు. కానీ వీకెండ్లో ఈ సినిమా కొంతమేరకు పుంజుకుంది.
శనివారం ఉదయం నుంచి అఖండ-2కు ఆక్యుపెన్సీలు బాగున్నాయి. సాయంత్రం, నైట్ షోలకు హైదరాబాద్‌లో చాలా చోట్ల ఫుల్స్ పడ్డట్లు కనిపిస్తోంది. బుక్ మై షోలో చూస్తే కొన్ని షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. ఆదివారం కావడంతో ఇవాళ కూడా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ఈ రెండు రోజుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే షేర్ రాబోతోంది. వీకెండ్ తర్వాత డ్రాప్ చూసి.. బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవని అనుకున్నారు. కానీ రెండో వీకెండ్లో పెర్ఫామెన్స్ చూస్తే నష్టాలు తగ్గుతాయని స్పష్టమవుతోంది.
నైజాం ఏరియాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కును కూడా అందుకునేలా ఉంది. మిగతా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కష్టమైనప్పటికీ.. నష్టాలు అయితే మరీ ఎక్కువ ఉండనవిపిస్తోంది. ఐతే అఖండ-2 టీం ఈ సమయంలో ప్రమోషన్ల జోరు కొంచెం పెంచాల్సింది. బాలయ్య, బోయపాటి అనవసరంగా వారణాసికి వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వచ్చారు. దాని బదులు ఇక్కడే ఒక ఈవెంట్ చేసి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే బోయపాటి, తమన్ కలిసి ఒక ఇంటర్వ్యూ అయితే చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates