అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన స్థాయిలో మేజిక్ చేయలేకపోయిందన్నది వాస్తవం. వంద కోట్ల షేర్ ఖాయమని ఫిక్స్ అయిన బాలయ్య అభిమానులు ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం ఎదురు చూస్తున్నారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ కు యావరేజ్ రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో ఈ వీకెండ్ ఏమైనా పికప్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కానీ ఏదో అద్భుతం జరిగిపోయి రెండు రోజుల్లో కలెక్షన్లు ఒక్కసారిగా ఊపందుకుంటాయని చెప్పలేం. అంచనాలు ఎక్కువైపోవడమే దీనికి కారణం.
ఇక్కడో విషయం గమనించాలి. నందమూరి హీరోలకు నెంబర్ 2 అదే ఈ సీక్వెల్ మంత్రం అంతగా అచ్చివస్తున్నట్టు లేదు. జూనియర్ ఎన్టీఆర్ కు వార్ 2 ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ అయ్యింది. కళ్యాణ్ రామ్ బింబిసార 2 ప్రకటించి నెలలు గడిచిపోతున్నా ఇప్పటిదాకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. దర్శకుడు మారినా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు. దీనికన్నా ముందు డెవిల్ 2 కూడా చేద్దామని చూసిన కళ్యాణ్ రామ్ దాని రిజల్ట్ దెబ్బకు ఆ ఆలోచన మానుకున్నాడు. అది కూడా డైరెక్టర్ కు సంబంధించిన కాంట్రావర్సిలో నలిగిన సినిమానే. ఇవన్నీ చూస్తే మురారి టైపులో ఏదో శాపంలాగా అనిపిస్తోంది.
దేవర 2 గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తారక్ పుట్టినరోజుకి సీక్వెల్ కన్ఫర్మ్ చేస్తూ టీమ్ ఒక పోస్టర్ వదలింది కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు. ప్రశాంత్ నీల్ షూటింగ్ లో బిజీగా ఉన్న జూనియర్ మీడియాకు దొరకడం లేదు. కొరటాల శివ అసలు బయట కనిపిస్తే ఒట్టు. దేవర 2 ఉంటుందో లేదో నేరుగా తేల్చి చెప్పడం లేదు. ఇదే కాదు సంవత్సరాల తరబడి బాలకృష్ణ కలలు కంటున్న ఆదిత్య 369 సీక్వెల్ కూడా లేటవుతూనే వస్తోంది. దర్శకుడిగా క్రిష్ లాకయ్యాడని అన్నారు కానీ ఇప్పుడది కూడా డౌటే. మరి ఈ నెంబర్ 2 నెగటివ్ సెంటిమెంట్ ని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates