రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్ లాంటి కల్ట్ మూవీస్‌తో ఇండియన్ సినిమానే ఒక ఊపు ఊపేశాడు. వర్మ స్ఫూర్తితో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లకు లెక్క లేదు. స్వయంగా వర్మ పరిచయం చేసిన నటులు, టెక్నీషియన్ల జాబితా తీస్తే అది సెంచరీ కంటే ఎక్కువే ఉంటుంది.
ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఎంతోమందిపై ఆయన ప్రభావం ఉంది. సందీప్ వంగ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ కూడా తన మీద వర్మ ప్రభావం గురించి గొప్పగా చెబుతుంటాడు. రాజమౌళి సహా ఎందరో గొప్ప దర్శకులకు ఆయనంటే అభిమానం ఉంది. ఐతే మధ్యలో తన స్థాయిని మరిచి పేలవమైన సినిమాలు తీయడం, దారుణమైన కామెంట్లు, ట్వీట్లు చేయడం.. రాజకీయ బురద అంటించుకుని అందులో పొర్లాడడం.. ఇలా చాలా పతనం అయిపోయాడు వర్మ. మీ స్థాయికి ఈ సినిమాలేంటి.. ఈ కామెంట్లేంటి అంటే… అలా అన్న వారితో వితండవాదం చేసి వారి నోళ్లు మూయించేవాడు వర్మ.
ఐతే గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత వర్మ తీరు మారిపోయింది. రాజకీయాలకు ప్యాకప్ చెప్పేశాడు. వాటి ఊసే ఎత్తట్లేదు. మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. ట్విట్టర్లో సెన్సిబుల్ కామెంట్లు చేస్తున్నాడు. సినిమాల మీద తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నాడు. శ్రద్ధగా ఒక సినిమా కూడా తీస్తున్నాడు. తాజాగా ఆయన దురంధర్ సినిమాను విశ్లేషిస్తూ పెట్టిన పోస్టు సోషల్ మీడియాను ఊపేసింది.
చాలామంది బాలీవుడ్ క్రిటిక్స్ దురంధర్ సినిమాకు నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. వాళ్లందరికీ గడ్డి పెట్టేలా ఉందంటూ వర్మ విశ్లేషణను నెటిజన్లు కొనియాడుతున్నారు. సీనియర్ నటుడు పరేష్ రావల్.. వర్మ రివ్యూను ప్రశంసిస్తూ, ఇది బాలీవుడ్ క్రిటిక్స్‌కు చెంపపెట్టులాంటి సమాధానం అన్నాడు. ఇక వర్మ రివ్యూపై దురంధర్ దర్శక నిర్మాత ఆదిత్య ధర్ అయితే ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. వర్మ దగ్గర పని చేయాలనే లక్ష్యంతో తాను ముంబయికి వచ్చిన రోజులను అతను గుర్తు చేసుకున్నాడు.
తన మీద వర్మ ప్రభావం ఎలాంటిదో చెప్పాడు. వర్మ ఇలా తన సినిమాను ప్రశంసించడం అంటే అంతకంటే పెద్ద విషయం ఇంకోటి ఉండదంటూ తన ఎగ్జైట్మెంట్‌ను చూపించాడు ఆదిత్య. దురంధర్ సినిమాకు ఎన్నో ప్రశంసలు లభించినా.. వర్మ రివ్యూకే ఆదత్య ఇంతగా ఎగ్జైట్ అయ్యాడు. దీన్ని బట్టి వర్మపై అతడికున్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎంతోమందికి వర్మ ఇప్పటికీ ఆరాధ్య దర్శకుడు. తన స్థాయి ఏంటో వర్మ గుర్తించి కొంచెం శ్రద్ధ పెడితే ఇప్పడు కూడా ఓ మంచి సినిమా తీయగలడని అభిమానులు ఆశిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates