బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వాళ్లు నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే బన్నీ, అట్లీ ఇద్దరికీ విడివిడిగా భారీ మార్కెట్  ఉన్నప్పటికీ.. ఇంత బడ్జెట్‌ను వర్కవుట్ చేయడం సాధ్యమేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. సినిమా పూర్తయ్యేసరికి బడ్జెట్ ఇంకా పెరగొచ్చనే చర్చ కూడా జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రెండు భాగాలుగా తీద్దామనే ఆలోచనను టీం చేస్తోందని ఇటీవల ఓ ప్రచారం మొదలైంది. ఇలా ఏ పెద్ద సినిమా మొదలైనా.. రెండు భాగాల ఆలోచన చేయడం కొన్నేళ్లుగా నడుస్తున్న ట్రెండు. బాహుబలి మొదలుకుని ఎన్నో సినిమాలకు ఇదే జరిగింది. బన్నీ చివరి చిత్రం ‘పుష్ప’ కూడా ఒక సినిమాగా మొదలై, రెండుగా మారిన సంగతి తెలిసిందే. అట్లీతో ఐకాన్ స్టార్ కొత్త సినిమాకు కూడా అలాగే చేయబోతున్నట్లు రూమర్లు వినిపించాయి.

కానీ చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఆ రూమర్లు నిజం కావట. బన్నీ, అట్లీ సినిమాను ఒక పార్ట్‌గానే చేయాలనుకుంటున్నారట. ఇప్పటిదాకా రెండు పార్ట్‌ల ఆలోచనేమీ లేదని తెలుస్తోంది. బన్నీ, అట్లీ కాంబినేషన్‌కు రూ.800 కోట్లు మరీ ఎక్కువ బడ్జెట్ ఏమీ కాదని.. ఈ చిత్రానికి 1000 కోట్లకు తక్కువగా బిజినెస్ కాదని అంచనా వేస్తున్నారట. బిజినెస్ కోణంలో ఆలోచించి రెండు భాగాలుగా తీస్తే కథను సాగదీయాల్సి ఉంటుందని.. దాని వల్ల బిగి తగ్గుతుందని అనుకుంటున్నారట.

ఆల్రెడీ ‘పుష్ప’ రెండు భాగాల కోసం ఐదేళ్లు వెచ్చించిన బన్నీ.. ఈ చిత్రం కోసం అలా ఐదేళ్లు కేటాయించడానికి సిద్ధంగా లేడట. ఒక సినిమా అందించి.. రెండో భాగం కోసం ప్రేక్షకులను ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయించే ఉద్దేశం బన్నీకి లేదని.. అట్లీ కూడా ఆ ఆలోచన చేయట్లదేని.. అందుకే ఇది ఒక భాగంగా వచ్చే అవకాశాలే ఎక్కువ అని అంటున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివర్లో కానీ.. లేదా 2027 ఆరంభంలో కానీ విడుదల చేయాలని చూస్తోంది చిత్ర బృందం.