భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా కనిపించారంటే అది ఈ ఒక్క సినిమాకే అన్నది నిజం. అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ విజువల్ గ్రాండియర్ కు రాజమౌళి, సుకుమార్ లాంటి టాలీవుడ్ స్టార్ దర్శకులు ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ ప్రోమోట్ చేయడంతో సాధారణ ప్రేక్షకుల దృష్టి కూడా దీని మీద ఉంది. రెండో భాగంతో పోల్చుకుంటే అప్పుడున్నంత హైప్ ఇప్పుడు కనిపించలేదు కానీ ఫాన్స్ మాత్రం భారీ అంచనాలతో ఎదురు చూశారు. నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో స్పెషల్ షో వేయడం గమనార్హం.
ఇక కంటెంట్ విషయానికి వస్తే అవతార్ 3 ఇప్పటిదాకా వచ్చిన ఫ్రాంచైజీలో వీక్ మూవీ అని ఒప్పుకోక తప్పదు. విజువల్స్, గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, పండోరా ప్రపంచాలు అద్భుతంగా ఉన్నప్పటికీ ఎమోషన్ విషయంలో సాగతీత స్క్రీన్ ప్లే అవలంబించిన జేమ్స్ క్యామరూన్ మరీ కొత్తగా ఫైర్ అండ్ యాష్ ని ప్రెజెంట్ చేయలేకపోయారు. ముఖ్యంగా సెకండాఫ్ నిడివి ఓపికకు పరీక్ష పెట్టే రేంజ్ లో సాగగా అధిక శాతం సన్నివేశాలు గతంలో చూసిన ఫీలింగే కలిగించడం అసలు మైనస్. ఐమాక్స్, డాల్బీ లాంటి అత్యాధునిక 3డి స్క్రీన్లలో చూస్తే బాగానే ఉంటుంది కానీ ఏ మాత్రం మాములు థియేటర్లో చూసినా బోర్ కొట్టడం ఖాయం.
వీర ఫ్యాన్స్ కు అవతార్ ఫైర్ అండ్ యాష్ ఓకే అనిపించినా రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం ఎన్నిసార్లు ఇదే స్టోరీ తీస్తారని ఖచ్చితంగా అనుకుంటారు. స్పైడర్ మ్యాన్, గాడ్జిల్లా, జురాసిక్ పార్క్ లాగా పదే పదే విస్తరించే స్కోప్ అవతార్ లో తక్కువ. అయినా సరే గత పద్దెనిమిది సంవత్సరాలుగా జేమ్స్ క్యామరూన్ తన జీవితాన్ని అవతార్ కే అంకితం చేశారు. థర్డ్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయితే ఇంకో రెండు భాగాలు తీస్తానని గతంలోనే ప్రకటించిన ఈ ఆస్కార్ విన్నర్ నిజంగా అన్నంత పని చేస్తారా లేదానేది వరల్డ్ వైడ్ ఫైనల్ రన్ అయ్యాక తెలుస్తుంది. అభిమానులు మినహాయించి మిగిలిన వాళ్ళకు అవతార్ 3 యావరేజ్ ఫీలింగే మిగులుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates