సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా ఇలాంటి ఈవెంట్లు చేసే నిర్వాహకులు అప్రమత్తం కావడం లేదు. సినీ తారలు వస్తున్నారంటే అక్కడికి పెద్ద ఎత్తున జనం పోగవుతారన్నది తెలిసిన విషయమే. పైగా అది ఓ పెద్ద సినిమాకు సంబంధించిన ఈవెంట్ అంటే.. లీడ్ హీరోయిన్ దానికి హాజరవుతోందంటే.. సోషల్ మీడియాలో ఆ ఈవెంట్ గురించి ఎక్కువ ప్రచారం జరిగితే ఇక జనాన్ని అదుపు చేయడం చాలా కష్టం. పకడ్బందీ ఏర్పాట్లు చేయకపోతే అంతే సంగతులు.
నిన్న ‘రాజాసాబ్’ రెండో పాట లాంచ్ కోసం హైదరాబాద్ కూకటపల్లిలోని ‘లులు మాల్’లో చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ లోపంతో అస్తవ్యస్తంగా తయారైంది. హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఈవెంట్ వేదిక నుంచి బయటికి తీసుకురావడానికి తీవ్ర ఇబ్బంది తలెత్తింది. జనం మధ్య నలిగిపోయిన నిధి.. ఒక దశలో ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంది. కార్లోకి ఎక్కాక ఆమె అసహనం, నిట్టూర్పు చూస్తే అర్థమైపోతుంది నిధి ఎంత ఇబ్బంది పడిందన్నది.
ఐతే ఇలాంటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఆమె సంయమనం కోల్పోలేదు. అసలు ఒక మాల్‌లో ఓపెన్ ఏరియాలో ఎలాంటి బారికేడ్స్ కూడా లేకుండా ఒక స్టార్ హీరోయిన్‌ను తీసుకొచ్చి పెద్ద ఈవెంట్ చేయడం అన్నది ఎంత పెద్ద రిస్కో నిర్వాహకులు ఆలోచించకపోవడం దారుణం. ఇందులో ఆర్గనైజర్స్ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. ఈ నేపథ్యంలో నిధి సోషల్ మీడియాలో పోస్టు పెట్టి నిర్వాహకుల తీరును నిధి ఎండగడుతుందేమో.. మీడియాతో దీని గురించి మాట్లాడుతుందేమో అనుకున్నారంతా. కానీ ఆమె అలా చేయలేదు. ‘సహానా’ పాటను సోషల్ మీడియాలో లాంచ్ చేసింది.
తన సినిమాల ప్రమోషన్ల కోసం నిధి ఎంత కష్టపడుతుందో అందరికీ తెలిసిందే. ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం అనేక ఈవెంట్లలో పాల్గొంది. స్వయంగా పవన్ కళ్యాణ్ ఆమె కష్టం గురించి చెబుతూ, అలా ప్రమోట్ చేయకపోవడం తనకు సిగ్గుగా అనిపిస్తోందన్నారు. ఇప్పుడు ‘రాజాసాబ్’ ప్రమోషన్లలో కూడా నిధినే లీడ్ తీసుకుంది. ఇందులో ఇంకో ఇద్దరు హీరోయిన్లున్నప్పటికీ నిధినే ముందుగా ప్రమోషన్లకు హాజరైంది. ప్రభాస్ అందుబాటులో లేకపోయినా తాను సినిమాను ప్రమోట్ చేయాలనుకుంది. కానీ అనుకోని పరిణామంతో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడింది. అయినా సరే ఆమె ప్రమోషన్లకు దూరమయ్యేలా లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates