రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా విడుదల చేయబోతున్నారు. ఏపీ తెలంగాణ హక్కులు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకోవడంతో మంచి రిలీజ్ దక్కనుంది. పలు వాయిదాల తర్వాత ఫైనల్ గా లాలెట్టన్ క్రిస్మస్ పండక్కు వస్తున్నారు. దీనికి నంద కిషోర్ దర్శకుడు. అత్తారింటికి దారేది, గోపాల గోపాల కన్నడ రీమేక్స్ తీసి హిట్టు కొట్టిన ట్రాక్ రికార్డు ఉంది. వీటికన్నా ఎక్కువ డెబ్యూ మూవీ విక్టరీ మంచి పేరు తీసుకొచ్చింది. ఆ మధ్య యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జతో పొగరు తీసింది నంద కిషోరే.
వృషభని ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. మోహన్ లాల్ డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తారు. ఒకటి యుద్ధవీరుడిగా, మరొకటి కోటీశ్వరుడైన వ్యాపారవేత్తగా కనిపించనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పుడు హీరో వారసుడి పాత్ర కోసం శ్రీకాంత్ కొడుకు రోషన్ ని తీసుకుని కొంత భాగం షూట్ కూడా చేశారు. అఫీషియల్ గానూ ప్రకటించారు. కానీ ఛాంపియన్ కోసం డేట్లు సర్దుబాటు కాక అతను తప్పుకోవడంతో ఆ స్థానంలో సమర్జిత్ లోకేష్ వచ్చాడు. ఆయ్ ఫేమ్ నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. సామ్ సిఎస్, అరియన్ మెహదీ సంగీతం సమకూర్చారు. మూడు నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో వృషభ తెరకెక్కింది.
డిస్ట్రిబ్యూషన్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్న గీతా ఆర్ట్స్ ఇప్పుడీ వృషభని తీసుకోవడం చూస్తే కంటెంట్ ఏదో ఉన్నట్టే కనిపిస్తోంది. గతంలో కాంతార, చావా లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన గీతా డిస్ట్రిబ్యూషన్ వాటిని కొంత ఆలస్యంగా తెలుగులోకి తీసుకొచ్చింది. కానీ వృషభకు అలా చేయకుండా ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తోంది. ఛాంపియన్, శంబాలా, ఈషా లాంటి చాలా సినిమాలతో మోహన్ లాల్ కు పోటీ ఉంది. ఈ బ్యాక్ డ్రాప్ లో ఆయన చేసిన సినిమాలు వర్కౌటయిన దాఖలాలు తక్కువ. వృషభ ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకుంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates