తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడైన అకీరా.. ఇప్పటికే మెగా అభిమానుల్లో, యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమాలతో అస్సలు సంబంధం లేనట్లు ఉంటున్నప్పటికీ.. అతనెప్పుడైనా బయట కనిపించినా, తన పుట్టిన రోజు వచ్చినా సోషల్ మీడియా వేడెక్కిపోతోంది.
ప్రస్తుతం సంగీతం, మార్షల్ ఆర్ట్స్ మీద దృష్టిపెట్టిన అకీరా.. కొన్నేళ్లలో తెరంగేట్రం చేస్తాడనే అంతా అనుకుంటున్నారు. నటనలోనూ అతను శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అకీరాను లాంచ్ చేసే దర్శకుడు, నిర్మాత ఎవరనే ఆసక్తి అందరిలోనూ ఉంది. తనకు ఆ ఛాన్స్ వస్తే.. అకీరాతో పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ చేస్తానంటున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టి.జి.విశ్వప్రసాద్.
ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధం గురించి, మళ్లీ ఆయనతో సినిమా చేసే అవకాశాల గురించి విశ్వప్రసాద్ మాట్లాడారు. అకీరాతో సినిమా చేసే అవకాశం గురించీ స్పందించారు. “పవన్ కళ్యాణ్ గారితో నా పరిచయం, బంధం సినిమాలతో సంబంధం లేకుండా జరిగింది. ఆయనతో అనుబంధం పెరిగాక మా సంస్థలో సినిమా చేయడానికి డేట్లు ఇచ్చారు. అలా బ్రో మూవీ చేశాం.
మళ్లీ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనుకుంటున్నాం. కానీ దాని గురించి ఆయనతో పూర్తి స్థాయిలో మాట్లాడలేదు. ఆ ఛాన్స్ కోసం చూస్తున్నాం. అకీరాను లాంచ్ చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాం. అతడితో పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీ తీస్తాం. త్వరలో మా సంస్థ నుంచి ఒక పాన్ వరల్డ్ సబ్జెక్ట్‌తో సినిమా రానుంది. అకీరా హైట్, పర్సనాలిటీని బట్టి చూస్తే అతను పర్ఫెక్ట్ హీరో మెటీరియల్. అతణ్ని లాంచ్ చేయాలనే ఆసక్తి నాకు ఉంది” అని విశ్వప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఇటీవలే పీపుల్ మీడియా సంస్థ నుంచి మోగ్లీ అనే చిన్న సినిమా వచ్చింది. దీనికి ఆశించిన స్పందన రాలేదు. ఈ సంస్థ చివరి చిత్రం తెలుసు కదా కూడా సరిగా ఆడలేదు. అంతకుముందు వచ్చిన మిరాయ్ మాత్రం పెద్ద హిట్టయింది. సంక్రాంతికి ఈ సంస్థ నుంచి రాజాసాబ్ లాంటి భారీ చిత్రం రాబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates