అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న స్టార్ డైరెక్టర్ అతనే. ఇప్పటిదాకా ఎనిమిదీ సినిమాలు తీస్తే ఎనిమిదీ విజయవంతం అయ్యాయి. ఎఫ్-2 ఓ మోస్తరు వసూళ్లు సాధించింది తప్పితే మిగతావన్నీ హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్లే. చివరగా అతను రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లతో సంచలనం రేపింది.
ఐతే విజయాలు సాధిస్తున్నప్పటికీ.. అనిల్ మీద ఒక వర్గంలో వ్యతిరేకత ఉంది. అతను రొటీన్ సినిమాలు తీస్తాడని.. కామెడీ, క్యారెక్టర్లు క్రింజ్‌గా ఉంటాయని విమర్శలు వస్తుంటాయి. ఈ విమర్శల గురించి తాజాగా అనిల్ స్పందించాడు. తన సినిమాలు క్రింజ్ అన్నా తాను పట్టించుకోనని.. అలా పట్టించుకుంటే హిట్ సినిమాలు తీయలేనని అతనన్నాడు.
”క్రింజ్ అనే పదం నాతో ప్రయాణం చేస్తూనే ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం తరహాలో ఇంకో పది బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించినా.. నన్ను కొందరు క్రింజ్ డైరెక్టర్ అనే అంటారు. కానీ అలాంటి వాళ్లు పది శాతమే ఉంటారు. మిగతా 90 శాతం మంది నా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నపుడు, టికెట్లు కొంటున్నపుడు నేను ఆ పది శాతం గురించి ఎందుకు ఆలోచించాలి? నా నిర్మాతలు, బయ్యర్లు సంతోషంగా ఉన్నపుడు వీళ్లను నేనెందుకు పట్టించుకోవాలి. నా సినిమాలను ఆదరిస్తున్న 90 శాతంమంది నన్నువిమర్శిస్తే అప్పుడు నేను బాధ పడాలి. ఆలోచించాలి. లేదంటే నేను విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని అనిల్ అన్నాడు.
సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజు పాత్ర చేసిన చిన్న పిల్లాడితో బూతులు మాట్లాడించడం గురించి కూడా అనిల్ స్పందించాడు. తాను లెజెండరీ డైరెక్టర్ జంధ్యాల తీసిన హై హై నాయకా మూవీ నుంచి స్ఫూర్తి పొంది ఆ కామెడీ ట్రై చేశానన్నాడు అనిల్.
ఇప్పటి పిల్లలు యూట్యూబ్ చూస్తూ అలాగే బూతులు మాట్లాడుతున్నారని.. తన కొడుకు కూడా అలాగే ఉన్నాడని.. అతణ్ని మార్చే ప్రయత్నం చేస్తున్నామని.. తల్లిదండ్రులకు ఒక హెచ్చరికలాగా ఈ పాత్రను డిజైన్ చేశామని.. ఒక పాత్రతో కొంచెం అతి చేయించడమో, ఇంకోటో చేయకుండా కామెడీ పుట్టించడం కష్టమని అనిల్ అన్నాడు. జనాలు బుల్లిరాజు పాత్రను ఆదరించారని.. అతణ్ని స్టార్‌ను చేశారని.. వాళ్లు కనెక్ట్ కాకపోతే అతడికంత పేరు వచ్చేదా అని అనిల్ ప్రశ్నించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates