అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని, అంత పెద్ద సమస్య వచ్చి డిసెంబర్ నాలుగు రాత్రి రిలీజ్ కావాల్సిన సినిమాను కొన్ని గంటల ముందు నిలువరించడం సరికాదని, ముందే ఆపేయకుండా చివరి నిముషంలో కేసులు వేయడం గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. టాలీవుడ్ లో యూనిటీ లేదని, అందరూ కలిసి కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని, కానీ అలా జరగడం లేదని, ఇకపై ఇలాంటివి లేకుండా ఐకమత్యంతో అందరూ ఒక్కటిగా సాగాలని హితబోధ చేశాడు. వినడానికి బాగానే ఉంది కానీ తమన్ ఇక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాడు.
ప్రీమియర్లకు కేవలం కొన్ని గంటల ముందు కోర్టు ఆర్డర్ వచ్చి షోలు ఆగిపోయాక పరిశ్రమ పెద్దలు రంగంలోకి దిగారు. సురేష్ బాబు, దిల్ రాజు తదితరులు దీన్ని ఒక కొలిక్కి తేవడానికి చాలానే కష్టపడ్డారు. అసలు ఎరోస్ తో సమస్య ఏళ్ళ తరబడి ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోవాల్సింది సదరు నిర్మాతలు. ఒకవేళ తీవ్రమైన ఇబ్బంది ఏర్పడి అదేదో ముందే బయటికి చెప్పుకుని ఉంటే ఎవరో ఒకరు సహాయం చేసేవాళ్ళు. కానీ గుట్టుగా ఉంచడం వల్ల వ్యవహారం తీవ్రంగా మారిపోయింది. నిర్మాత పడే టెన్షన్, నరకం అర్థం చేసుకోవాలి. అలాని తప్పులో పొరపాట్లో జరిగినప్పుడు అసలేమయ్యిందో తెలియకుండా ఎవరైనా ఎందుకు వస్తారు.
ఇప్పుడే కాదు తెలుగు సినిమాలో ఐక్యత ప్రతి రోజు కాకపోయినా అవసరమైనప్పుడు బయట పడుతూనే ఉంది. కరోనా వచ్చినప్పుడు సహాయం అందించడంలో అందరూ ఒక్కటై కదిలారు. ఫెడరేషన్ సమ్మె జరిగి షూటింగులు ఆగిపోతే నిద్రలేని రాత్రులతో సొల్యూషన్ కోసం పోరాడిన తెరవెనుక నిర్మాతల లిస్టు పెద్దదే ఉంది. వందల కోట్లతో ముడిపడిన సినిమా వ్యవహారంలో ఎవరి తలనెప్పులు వాళ్ళకున్నాయి. పక్క ప్రొడ్యూసర్ కు హఠాత్తుగా ఒక పాతిక కోట్లు అవసరమైతే నిమిషాల్లో తెచ్చివ్వడం చాలా కష్టం. ఎవరి మానాన వాళ్ళుంటే అఖండ 2 మొన్న రావడం కష్టమయ్యేది. కానీ ఒకటికొకరు చేయూత ఇచ్చుకున్న మాట వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates