మసక మసక ఎలా ఉంది

ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని స్మిత చేసిన కృషి చాలా ఉంది. 2002లో హాయ్ రబ్బా పేరుతో చేసిన ప్రైవేట్ ఆల్బమ్ తనకు చాలా పేరు తీసుకొచ్చింది. అప్పటిదాకా సినిమాల ఆడియో క్యాసెట్లే అమ్ముడుపోతాయనే ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ కొత్త జానర్ పరిచయం చేశారు స్మిత. తర్వాత దేవుడు చేసిన మనుషులు సినిమా నుంచి మసక మసక చీకటిలో పాటను రీమిక్స్ చేయడం స్మిత పాపులారిటీ పెంచింది. సాజిద్ వాజిద్ కంపోజింగ్ లో అయిదు పాటలు పాడిన స్మిత ఆ తర్వాత సినిమాల్లో ఎనభై దాకా పాటలు పాడారు. ఎవరైనా చూసుంటారా వాటిలో ఒకటి.

చాలా గ్యాప్ తర్వాత స్మిత మరోసారి పాప్ సాంగ్ తో మ్యూజిక్ లవర్స్ ముందుకు వచ్చారు. ఈసారి కూడా మసక మసక చీకటిలోనే ఎంచుకున్నారు. దానికి వైరెటీ ఇన్స్ ట్రుమెంటేషన్ తో పాటు నలభై అయిదు వయసులోనూ హుషారుగా స్టెస్ప్ వేయడం ఆకట్టుకునేలా ఉంది. ఈసారి స్మితకు తోడుగా నియోల్ సియోన్ వచ్చాడు. విజయ్ బిన్నీ మాస్టర్ డాన్స్ ప్లస్ డైరెక్షన్ కంపోజ్ చేసిన నృత్య రీతులకు ఇద్దరూ హుషారుగా ఆడిపాడారు. బీట్స్ వగైరాలన్నీ మోడరన్ గా ఉన్నాయి. అయితే చాలా కాలంగా రీమిక్స్ పాటలు రాని నేపథ్యంలో ఇప్పుడీ మసక మసక ఎలాంటి మేజిక్ చేస్తుందనేది వేచి చూడాలి.

మరీ గొప్పగా అలాని మరీ చప్పగా లేకుండా బాలన్స్ గా సాగిన ఈ పాటకు స్మితతో పాటు సుమిత్ దినకర్ సువర్ణ సంగీత బాధ్యతలు పంచుకున్నారు. లిరిక్స్ స్మిత, సియోల్ ఇద్దరూ కలిసి రాశారు. సాంగ్ అయితే హుషారుగా సాగింది కానీ వేగంగా వైరల్ అయ్యేంత అనిపించదు. కాకపోతే ఇలాంటివి స్లో పాయిజన్ లాగా ఎక్కుతాయి కాబట్టి వెయిట్ చేయాలి. ఆ మధ్య సెలబ్రిటీ యాంకర్ గా సోని లివ్ కోసం టాక్ షో చేసిన స్మిత అడగ్గానే చిరంజీవి, చంద్రబాబునాయుడు, సందీప్ రెడ్డి వంగా లాంటి వాళ్ళు వచ్చి తమ మనోభావాలు పంచుకున్నారు. ఇకపై స్మిత ఫుల్ టైం సింగర్ గా కొనసాగాలని ఫ్యాన్స్ కోరిక.