నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కొంత వివాదానికి దారి తీయడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సదరు అధికారికి క్షమాపణ చెబుతూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. తన పాత్రను గొప్పగా చెప్పుకునే క్రమంలో సరోజ్ కుమార్ అతిశయోక్తిగా మాట్లాడ్డంతో అది కాస్తా సెన్సార్ అధికారుల కోణంలో నెగటివ్ గా వెళ్ళింది. నిజానికి వాళ్ళేమీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయకపోయినా నిర్మాతగా తాముగా బాధ్యత వహించి సారీ చెప్పారు. ఆ కామెంట్స్ తాలూకు వీడియోలు ఎక్కడ లేకుండా చర్యలు తీసుకుని డిలీట్ చేయించే పనిలో ఉన్నారు.
నిజానికిది మంచి సంప్రదాయం. పబ్లిక్ స్టేజి మీద తమను తాము ఎక్కువ చేసుకుని చెప్పుకునే క్రమంలో ఆర్టిస్టులు అప్పుడప్పుడు స్లిప్ అవుతూ ఉంటారు. ఆ మధ్య ఒక సీనియర్ మోస్ట్ నటుడు ఆస్ట్రేలియా క్రికెటర్ ని ఉద్దేశించి అన్న మాటలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఇదే ఆర్టిస్టు మరో సందర్భంలో ఒక కమెడియన్ ని, మరో చోట లెజెండరీ హాస్య నటుడిని ఎగతాళి చేయడం సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఓసారి సారీ చెప్పారు కానీ మిగిలిన సంఘటనలు గాలిలో కలిసిపోయాయి. ఇలాంటి ఉదాహరణలు బోలెడున్నాయి. కాకపోతే సెన్సార్ ని ఉద్దేశించి ఇంత డైరెక్ట్ గా ఒక నటుడు ప్రస్తావించడం ఈ మధ్య కాలంలో అరుదు.
మోగ్లీ శనివారం విడుదల ఉన్నప్పటికీ గురువారమే పలువురు ఆహ్వానితులకు హైదరాబాద్ లో స్పెషల్ షో వేశారు. టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక షోకు హాజరు కావడంతో ప్రేక్షకుల దృష్టి దీనివైపుకు వెళ్తోంది. సింగల్ స్క్రీన్లలో కేవలం 99 రూపాయలు టికెట్ రేట్ పెట్టడం మోగ్లీకి ప్లస్ అయ్యేలా ఉంది. రాజు వెడ్స్ రాంబాయి స్ట్రాటజీనే దీనికి ఫాలో కావడం మంచి ఫలితం ఇచ్చేలా ఉంది. కలర్ ఫోటో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు సందీప్ రాజ్ ఈ మోగ్లీకి దర్శకుడు. సుమ, రాజీవ్ కనకాల వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ కనకాలకు డెబ్యూ మూవీ నిరాశపరిచాక ఆశలన్నీ దీని మీదే పెట్టుకున్నాడు. ప్రీమియర్ల రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates