అఖండ తాండవానికి మరో ఎదురుదెబ్బ

న‌ట‌సింహం బాల‌య్య హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన అఖండ్‌-2 సినిమాల‌కు బాలారిష్టాలు తీర‌డం లేదు. ఈ నెల తొలి వారంలోనే విడుద‌ల కావాల్సిన సినిమాకు త‌మిళ‌నాడు కోర్టు విధించిన ఆంక్ష‌ల కార‌ణంగా బ్రేకులు ప‌డ్డాయి. దీంతో బాల‌య్య అభిమానులు తీవ్ర నిరాశ‌కు గురయ్యారు. ఆ గండం నుంచి ఏదో ఒక విధంగా బ‌య‌ట‌ప‌డ్డామ‌ని భావిస్తున్న స‌మ‌యంలో అనూహ్యంగా తెలంగాణ హైకోర్టు మ‌రోసారి షాక్ ఇచ్చింది.

రెండో విడ‌త ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం రేపు (శుక్ర‌వారం-12-12) సినిమా రిలీజ్ కానుంది. దీనికి ముందు 11వ తేదీ(గురువారం) రాత్రి ప్రీమియ‌ర్‌షో ప్ర‌ద‌ర్శ‌న‌కు సినిమా రెడీ అయింది. అయితే.. ఈ షో టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచ‌డం.. అదేవిధంగా రెగ్యుల‌ర్ షోల‌కు కూడా టికెట్ ధ‌ర‌ల‌నురూ.50, రూ.100 చొప్పున పెంచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డంపై తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.

దీనిని విచారించిన హైకోర్టు.. ప్ర‌భుత్వం అలా ఎలా అనుమ‌తి ఇస్తుంద‌ని ప్ర‌శ్నిస్తూ.. స‌ద‌రు పిటిష‌నర్ అభ్య‌ర్థ‌న మేర‌కు.. టికెట్ల ధ‌ర‌లుపెంచుకునేందుకు ఇచ్చిన జీవోను ర‌ద్దు చేసింది. విచార‌ణ‌ను శుక్ర‌వారానికి వాయిదా వేసింది. ఈ ప్ర‌భావం సినీ అభిమానుల‌పై ముఖ్యంగా నిర్మాత‌ల‌పై ఎక్కువ‌గా ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఎంతో ఖ‌ర్చు చేసి ప్రీమియ‌ర్ షోన్‌ను ప్ర‌ద‌ర్శించే విష‌యంపై నిర్మాతలు త‌ర్జ‌న భ‌ర్జ‌నలో ప‌డ్డారు.

ఈ ప్రీమియ‌ర్ షోల విషయంలో గందరగోళం ఏర్పడింది. మ‌రోవైపు శుక్ర‌వారం కోర్టు విచార‌ణ ప్రారంభ‌మ‌య్యే స‌రికి రెగ్యుల‌ర్ షో ప్రారంభ‌మైపోతుంది. ఈ నేప‌థ్యంలో దీనిని కూడా వాయిదా వేస్తారా? అనే విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. కోర్టు తీర్పు వ‌చ్చే వ‌రకువెయిట్ చేయ‌డం అంటే.. పెద్ద స‌వాలే. మ‌రి ఏం చేస్తార‌న్న‌ది చూడాలి.