ట్రోల్స్ వల్లే రాజా సాబ్ తియ్యగలిగిన మారుతి

సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్ గురించి చాలామంది చాలా ఆవేశంతో స్పందిస్తుంటారు. ట్రోలర్స్ మీద మండిపడుతుంటారు. కానీ దర్శకుడు మారుతి మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తనను ట్రోల్ చేసే వాళ్లే తనకు ఎనర్జీ ఇస్తారని.. కాబట్టే ‘రాజా సాబ్’ లాంటి పెద్ద సినిమా తీయగలిగానని మారుతి వ్యాఖ్యానించాడు.

తమ ప్రొడక్షన్లో రాబోతున్న ‘3 రోజెస్’ సిరీస్‌కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో.. మారుతి అండ్ టీమ్ సీనియర్ నటి ప్రగతిని సన్మానించింది. ఆమె పవర్ లిఫ్టింగ్‌లో ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. సన్మానం అందుకున్న సందర్భంగా ప్రగతి తన మీద వచ్చిన ట్రోల్స్ గురించి చెప్పి బాధ పడ్డారు. అనంతరం మారుతి ఈ అంశం మీద మాట్లాడాడు. అలా ట్రోల్ చేయడం వల్లే ప్రగతి గోల్డ్ మెడల్ సాధించారని.. తాను కూడా ‘రాజాసాబ్’ తీయగలిగానని చెబుతూ ట్రోలర్స్‌ను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు మారుతి.

‘‘ప్రగతి గారు చాలా ఎమోషనల్ అయ్యారు. మేడం మిమ్మల్ని అందరూ తిట్టారని ఏమీ అనుకోవద్దు. వాళ్లందరూ తిట్టకపోతే మీరివాళ గోల్డ్ మెడల్ కొట్టేవాళ్లు కాదు. నేను రాజాసాబ్ తీసేవాడినీ కాదు. ఎందుకంటే వాళ్లు ట్రోలర్స్ వాళ్ల పనులన్నీ మానుకుని.. మన కోసం టైం పెట్టి.. ఏకాగ్రతతో వాళ్ల పాజిటివిటీ అంతా చంపుకుని.. ఒక నెగెటివ్ ఆలోచనను తెచ్చుకుని.. బ్రెయిన్ అంతా నెగెటివ్ చేసుకుని.. ఒక మాట మాట్లాడి, నాలుగు తిట్లు తిడుతున్నారంటే అంత ఈజీ కాదు మేడం అది.

వాళ్ల దగ్గర ఉన్నదే పంచుతున్నారు. నాలుగు బూతు మాటలు అంటున్నారు. నేనలాంటి కామెంట్లు చదివినపుడల్లా అనుకుంటూ ఉంటా. నీ దగ్గర ఉన్నది ఇదేనా? ఇంకేమీ లేదా? అనుకుంటా. మా నాన్నను ఎవరైనా తిడితే మీరు ఎందుకు తిరిగి తిట్టట్లేదు అంటే.. ’వాళ్ల దగ్గర ఉన్నది ఇస్తున్నారు, మన దగ్గర అది లేదు కాబట్టి ఇవ్వలేం’ అనేవాడు.

కాబట్టి ఎవరైనా తిడితే దాన్ని ఎనర్జీగా మార్చుకోవాలి. అలా మార్చుకున్నారు కాబట్టే ప్రగతి గారికి గోల్డ్ మెడల్ వచ్చింది. మీరు కూడా సక్సెస్ కావాలంటే మిమ్మల్ని తిట్టేవాళ్లను ఎంచుకోండి. లేదంటే మీరు ఏమీ సాధించలేరు. మీరు ఎనర్జీ ఇస్తే మేం ఎదుగుతూ ఉంటాం. మీరు మాత్రం అక్కడే ఉంటారు. నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్లందరికీ చాలా థ్యాంక్స్. మీరు లేకుంటే మేం లేం. ఏదీ సాధించలేం’’ అని మారుతి వ్యాఖ్యానించాడు.