నాతో నాకే పోటీ అంటున్న అఖండ విలన్

ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడైన ఆది.. పుట్టి పెరిగింది చెన్నైలోనే. తమిళంలో హీరోగా పలు చిత్రాలు చేసి విజయాలూ అందుకున్న ఆది.. తెలుగులో అప్పుడప్పుడూ నటిస్తున్నాడు. ఇక్కడ ఎక్కువగా అతను విలన్ పాత్రలే చేశాడు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతంలో ‘సరైనోడు’ చేసి మంచి పేరు సంపాదించిన ఆది.. ఇప్పుడు ‘అఖండ-2’ లాంటి భారీ చిత్రంలో బాలయ్యకు విలన్‌గా నటించడం విశేషం. ఈ సినిమా అతడికి ఇంకా ఎక్కువ పేరు తెస్తుందని అంచనా వేస్తున్నారు. విశేషం ఏంటంటే.. ‘అఖండ-2’ రిలీజయ్యే రోజే ఆది హీరోగా నటించిన సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రమే.. డ్రైవ్.

‘అఖండ-2’ డిసెంబరు 5న వస్తుందన్న అంచనాతో 12న అనేక చిన్న సినిమాలను షెడ్యూల్ చేసుకున్నారు నిర్మాతలు. కానీ ‘అఖండ-2’ అనూహ్యంగా వాయిదా పడి 12కు షిఫ్ట్ అయింది. దీంతో ఆ రోజు రావాల్సిన పలు చిత్రాలను వాయిదా వేశారు. కానీ మోగ్లీ, అన్నగారు వస్తారు చిత్రాలతో పాటు ‘డ్రైవ్’ కూడా 12కే ఫిక్స్ అయింది.

డ్రైవ్ కొన్నేళ్ల ముందు మొదలైన సినిమా. షూట్ ఎప్పుడో పూర్తయినా రిలీజ్ బాగా ఆలస్యం అయింది. భవ్య క్రియేషన్స్ బేనర్ మీద ఆనంద్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రాన్ని జెనూస్ మహమ్మద్ రూపొందించాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. ఐతే లాంగ్ డిలేయ్డ్ మూవీ కావడం, పెద్దగా పబ్లిసిటీ చేయకపోవడంతో ఈ సినిమాకు బజ్ క్రియేట్ కాలేదు. మరి రిలీజ్ తర్వాత టాక్ బాగుంటే సినిమా పుంజుకుంటుందేమో చూడాలి. ఇటు విలన్‌గా, అటు హీరోగా ఒకే రోజు బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమవుతున్న ఆదికి ఎలాంటి ఫలితం వస్తుందో?