ప్రదీప్ రంగనాథన్ రికార్డు… కష్టమేనా?

పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలకు కూడా సాధ్యం కాని ఘనతను.. తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సాధించాడు. హీరోగా నటించిన తొలి మూడు చిత్రాలతో అతను ప్రతిసారీ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించాడు. అతను స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ చేసిన తొలి సినిమా ‘లవ్ టుడే’ పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతోనూ అతను వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టాడు.

దీంతో పాటు ఒకే ఏడాది మూడు వంద కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకునే అవకాశం అతడికి వచ్చింది. తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో అతను చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (ఎల్ఐకే) కూడా ఈ ఏడాదే రిలీజ్‌కు రెడీ అయింది. డిసెంబరు 18కి విడుదల తేదీ ప్రకటించారు. ఈ దిశగా ప్రమోషన్లు చేస్తూ వచ్చారు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా.. టీం సైలెంట్ అయిపోతోంది.

18న ‘ఎల్ఐకే’ రావడం సందేహమే అన్నది కోలీవుడ్ వర్గాల టాక్. ఈ చిత్రానికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాలేదట. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ రీ రికార్డింగ్ ఫినిష్ చేయలేదట. ఇంకా తెలుగు డబ్బింగ్ పనులు కూడా పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ప్రదీప్‌కు తెలుగులోనూ బాగా క్రేజ్ ఉంది. తన మూడు చిత్రాలూ తెలుగులో మంచి వసూళ్లు సాధించాయి. పైగా ‘ఎల్ఐకే’లో కృతి శెట్టి కథానాయిక కావడం ప్లస్. కానీ ఈ సినిమాకు ఇప్పటిదాకా తెలుగులో ప్రమోషన్లే మొదలుపెట్టలేదు. తెలుగులో ఈ సినిమా రిలీజవుతున్నట్లే తెలియదు.

ఈ నెల 18న రిలీజ్ చేసేట్లయితే ఈపాటికి తెలుగు ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసి ఉండాలి. అలాంటిదేమీ చేయలేదు. తమిళంలో కూడా ప్రమోషన్లు అంతంతమాత్రంగా ఉన్నాయి. దీంతో 18న సినిమా వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంచెం హడావుడి అయినా సరే.. రాబోయే కొన్ని రోజుల్లో చకచకా అన్ని పనులూ పూర్తి చేసి వచ్చే వీకెండ్లో సినిమాను రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఒకవేళ రిలీజ్ చేసినా బజ్ తక్కువ ఉన్న ఈ సినిమా బాగా ఆడుతుందా అన్న సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఒకే ఏడాది మూడు 100 కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా ప్రదీప్ రికార్డు కొట్టే అవకాశం చేజారినట్లేనేమో?