ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల అందరూ అన్ని భాషల సినిమాలనూ చూసేస్తున్నారు. ఒకప్పుడంటే తమిళ, హిందీ రీమేక్‌లు అంటేనే వాటి విశేషాలు బయటికి వచ్చేవి. కానీ ఇప్పుడు మలయాళ సినిమాలతో మన వాళ్లకు బాగా యాక్సెస్ వచ్చేసింది. ఆ చిత్రాలు తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో అక్కడి సినిమాలను తీసుకొచ్చినా సరే ప్రోమోలు చూడగానే గుర్తు పట్టేస్తున్నారు.
విదేశీ భాషా చిత్రాలను రీమేక్ చేస్తుంటేనే ముందే కథ సహా అన్ని విషయాలూ బయటికి వచ్చేస్తున్నపుడు ప్రాంతీయ భాషా చిత్రాలను రీమేక్ చేస్తే పరిస్థితి ఏంటో చెప్పాల్సిన పని లేదు. రీమేక్ అనగానే ఎగ్జైట్మెంట్ పోతోంది. అందులోనూ వేరే భాషలో బాగా పాపులర్ అయిన సినిమాలను రీమేక్ చేస్తే మరింత ఇబ్బంది తప్పదు. అయినప్పటికీ మలయాళంలో పెద్ద హిట్టయిన జయజయజయజయహే చిత్రాన్ని తెలుగులో ఓం శాంతి శాంతి శాంతిహి పేరుతో రీమేక్ చేశారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రాన్ని సజీవ్ రూపొందించాడు. 35 నిర్మాత సృజన్ ప్రొడ్యూస్ చేశాడు.
ఈ సినిమా టీజర్ చూస్తే.. ఒరిజినల్లో హైలైట్ అయిన కోర్ పాయింట్‌ను దాచిపెట్టేశారు. ఎక్స్‌ట్రా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి గట్టిగానే ప్రయత్నించినట్లు కనిపించింది. టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడమేంటి అనే పాయింట్ మీద హీరో తరుణ్ భాస్కర్, నిర్మాత సృజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రీమేక్ అనేది పక్కన పెట్టాలని.. నిజాయితీగా సినిమా చేశామని.. రీమేక్ అనే ఫీలింగ్ రాకుండా ప్రయత్నం చేశామని తరుణ్ భాస్కర్ తెలిపాడు. ఈ సినిమా నచ్చితేనే చూడాలని, నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పాలని అన్నాడు తరుణ్. పెళ్ళిచూపులు రీమేక్ మలయాళంలో వంద రోజులు ఆడిన విషయాన్ని అతను గుర్తు చేశాడు.
ఇక నిర్మాత మాట్లాడుతూ.. ఈ సినిమా మొదలైనపుడు సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లను చూశానని చెప్పాడు. నిర్మాతకు డబ్బులు ఎక్కువై ఈ సినిమా చేస్తున్నాడా అని కూడా కామెంట్లు వచ్చాయన్నాడు. ఐతే 35 సినిమా చేసినపుడు అది క్లాసిక్ అవుతుందని చెప్పానని.. అలాగే ఈ సినిమాకు కూడా ఒక మాట చెబుతున్నానని.. ఇది జస్ట్ రీమేక్ కాదని, అంతకుమించి ఇందులో విశేషాలు ఉన్నాయని.. సినిమా చూస్తున్నపుడు రీమేక్ అనే ఫీలింగే రాదని.. అది తన గ్యారెంటీ అని చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates