నవ్వించి ఏడిపించి ఇప్పుడు భయపెడుతున్నారు

లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి చేసిన కృషి చిన్నది కాదు. మంచి కంటెంట్ జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద వీళ్ళు చూపించే శ్రద్ధ గొప్ప ఫలితాలు ఇస్తోంది. అలాని ప్రతి చిత్రాన్ని కొంటున్నారని కాదు కానీ బెస్ట్ అనిపించేవి మాత్రం వదలడం లేదు. ఇప్పుడు వీళ్ళ కలయికలో వస్తున్న కొత్త మూవీ ఈషా. డిసెంబర్ 12 థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఒకదానితో నవ్వించి, మరొకదానితో ఏడిపించిన ఈ ప్రొడ్యూసర్లు ఇప్పుడు భయపెట్టేందుకు వస్తున్నారు. ఇవాళ ఈషా ట్రైలర్ లో ఆ విషయం స్పష్టమవుతోంది.

కథ పరంగా చెప్పుకుంటే మరీ కొత్తగా అనిపించదు. అనగనగా శాపగ్రస్తమైన ఒక చిన్న పల్లెటూరు. సరిహద్దుల్లో ఒక పాడుబడిన ఇల్లు. దెయ్యాలు లేవని నమ్మే రెండు జంటలు అక్కడికి వచ్చి ఒక ఫకీర్ ని ఛాలెంజ్ చేస్తాయి. ఆత్మలు లేవని నిరూపిస్తామని చెప్పి అక్కడికి వెళ్తాయి. తీరా చూస్తే భయానక సంఘటనల మధ్య ప్రాణాలు రిస్కులో పడతాయి. ఒక చిన్న పాప హత్య ఎంత దారుణాలను చేసిందో తెలుసుకొనే కొద్దీ ఒక విషవలయంలో చిక్కుకుంటారు. అసలు ఈషా ఎవరు, వీళ్లంతా అక్కడికి ఎందుకు వచ్చారు లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే రాబోయే శుక్రవారం దాకా వెయిట్ చేయాల్సిందే.

గత కొన్నేళ్లుగా హారర్ అంటే ఎక్కుడ శాతం కామెడీ అయిపోయింది. దెయ్యలతో నవ్వించే పనులు చేయించడం వల్ల ఈ జానర్ కొంచెం రొటీన్ గా మారిన మాట వాస్తవం. అయితే ఈషా ఈ ట్రెండ్ కి భిన్నంగా సీరియస్ నెరేషన్ వైపు దృష్టి పెట్టింది. నిజంగా భయపెడితే ఆడియన్స్ కలెక్షన్లు ఇస్తారని ఆ మధ్య మాసూద నిరూపించింది. ఇప్పుడు ఈషా కూడా అదే తరహాలో సక్సెస్ కాగలిగితే మరిన్ని ప్రయత్నాలు జరగొచ్చు. శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించిన ఈషాకు ఆర్ఆర్ ధృవన్ సంగీతం సమకూర్చారు. తమ మునుపటి సినిమాల్లాగే ఇది కూడా హిట్టవుతుందనే నమ్మకం నిర్మాతల్లో కనిపిస్తోంది.