బాల‌య్య ఆదాయాన్ని పంచేసుకున్నారు

అనుకున్న ప్ర‌కార‌మే గ‌త గురువారం రాత్రి అఖండ‌-2కు ప్రిమియ‌ర్ షోలు ప‌డి ఉంటే.. సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ఉండి ఉంటే.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ వ‌సూళ్ల‌తో ర‌న్ అవుతుండేది. ఈపాటికి బాల‌య్య కొన్ని కొత్త రికార్డులు కూడా నెల‌కొల్పేవాడేమో. కానీ అనూహ్యంగా ఆ సినిమా రిలీజ్ ఆగిపోయింది. దీంతో శుక్ర‌వారం రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు క‌ళ త‌ప్పాయి. అఖండ‌-2 వాయిదా ప‌డ్డ నిరుత్సాహంలో తెలుగు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల వైపే క‌ద‌ల్లేదు ఆ రోజు. 

కానీ అఖండ‌-2 ఈ వీకెండ్లో రాద‌ని నిర్ణ‌యం అయిపోయాక‌ త‌ర్వాతి రోజు థియేట‌ర్ల‌కు క‌దిలారు. అందుబాటులో ఉన్న వాటిలో బెస్ట్ మూవీస్‌ను ఎంచుకున్నారు. శ‌ని, ఆదివారాల్లో థియేట‌ర్ల‌లో ఆక్యుపెన్సీలు మ‌రీ బ్యాడ్‌గా ఏమీ లేవు. రెగ్యుల‌ర్ తెలుగు సినీ గోయ‌ర్స్.. గ‌త వారం వ‌చ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా వైపు మ‌ళ్లారు. శ‌నివారం ఫ‌స్ట్, సెకండ్ షోల‌కు ఈ సినిమా మంచి ఆక్యుపెన్సీల‌తో న‌డిచింది. ఆదివారం కూడా రామ్ సినిమాకు మెరుగైన ఆక్యుపెన్సీలే క‌నిపించాయి. ఈవెనింగ్, నైట్ షోల‌కూ స్పంద‌న బాగుంది. 

అఖండ‌-2 వ‌చ్చి ఉంటే.. ఈ వీకెండ్ ఆంధ్ర కింగ్ తాలూకాను ఎవ్వ‌రూ ప‌ట్టించుకునేవారు కాదేమో. కొంత‌మేర ఓవ‌ర్ ఫ్లోస్‌తో సినిమా ర‌న్ అయ్యేది త‌ప్ప జనం దాని మీద దృష్టిపెట్టేవారు కాదు. కానీ బాల‌య్య సినిమా బ‌రిలోంచి త‌ప్పుకోవ‌డంతో ఈ సినిమాకు ఎక్స్‌టెండెడ్ ర‌న్ వ‌చ్చిన‌ట్లయింది. మ‌రోవైపు హిందీ సినిమా దురంధ‌ర్‌కు అఖండ‌=2 వాయిదా బాగానే క‌లిసొచ్చింది. హైద‌రాబాద్‌లోని ప‌లు మ‌ల్టీప్లెక్సుల్లో ఈ సినిమా శ‌ని, ఆదివారాల్లో చాలా షోల‌కు హౌస్ ఫుల్స్ ప‌డ్డాయి. 

సినిమాకు పాజిటివ్ టాక్ ఉండ‌డం, ప్ర‌త్యామ్నాయాలు త‌క్కువ‌గా ఉండ‌డంతో హిందీ సినిమాలు చూసే వాళ్లు ఈ చిత్రం కోసం బాగానే థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. ఇంకా తేరే ఇష్క్ మే, రాజు వెడ్స్ రాంబాయి, జూటోపియా-2 లాంటి సినిమాలు కూడా అఖండ‌-2 వాయిదా నుంచి బాగానే అడ్వాంటేజీ పొందాయి. మ‌మ్ముట్టి మ‌ల‌యాళం సినిమా కళంక‌వ‌ల్‌కు కూడా హైద‌రాబాద్‌లో మంచి వ‌సూళ్లు వ‌స్తుండ‌డం విశేషం.