ఎన్నో ట్విస్టులతో… డ్రీమ్ లవ్ స్టోరీకి బ్రేకప్

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ప్రేమకథకు శుభం కార్డు పడలేదు, బ్రేకప్ కార్డు పడింది. డీవై పాటిల్ స్టేడియంలో ప్రపోజల్స్, చేతి మీద పచ్చబొట్లు, ఆపై సడెన్ గా క్యాన్సిలేషన్ ప్రకటన.. అసలు ఈ లవ్ స్టోరీలో ఏం జరిగిందో అనే కామెంట్స్ చాలానే వస్తున్నాయి.

వీరి ప్రేమకథ 2019లో మొదలైంది. స్పోర్ట్స్, మ్యూజిక్ ఇంట్రెస్ట్ వీరిని కలిపింది. దాదాపు ఐదేళ్లు సీక్రెట్ గా సాగిన ప్రేమాయణాన్ని ఈ ఏడాది జూలైలో అఫీషియల్ చేశారు. స్మృతి అంటే పలాష్ కు ఎంత పిచ్చంటే.. తన చేతి మీద స్మృతి జెర్సీ నెంబర్ ‘SM 18’ అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. అంతే కాదు, ఇండియా వరల్డ్ కప్ గెలిచిన డీవై పాటిల్ స్టేడియంలోనే సినిమా రేంజ్ లో మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. ఆ సీన్ చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు, ఇదొక డ్రీమ్ లవ్ స్టోరీ అనుకున్నారు.

ఇక నవంబర్ 23న సాంగ్లీలో బాజాభజంత్రీలు మోగాల్సి ఉంది. కానీ సరిగ్గా అదే రోజు ఉదయం స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో పెళ్లి మండపం మూగబోయింది. ఆ టెన్షన్ తట్టుకోలేక వరుడు పలాష్ కూడా ఆసుపత్రి పాలయ్యాడు. విధి ఆడిన వింత నాటకానికి పెళ్లి వాయిదా పడింది. అప్పటివరకు అంతా సానుభూతిగానే ఉన్నారు. కానీ ఆ తర్వాతే అసలు గొడవ మొదలైంది.

ఆసుపత్రి నుంచి వచ్చాక స్మృతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. సోషల్ మీడియాలో ఎంగేజ్ మెంట్ రింగ్ లేకుండా కనిపించడం, పలాష్ ను అన్ ఫాలో చేయడం, పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో రూమర్స్ గుప్పుమన్నాయి. చీటింగ్ ఆరోపణలు కూడా వినిపించాయి. చివరకు ఆదివారం స్మృతి ఈ సస్పెన్స్ కు తెరదించారు. మా పెళ్లి ఆగిపోయింది, నా ప్రైవసీని గౌరవించండి అని పోస్ట్ పెట్టారు. ఇకపై నా దృష్టంతా దేశం కోసం కప్పులు కొట్టడం మీదే అని క్లారిటీ ఇచ్చారు.

అటు పలాష్ కూడా హర్ట్ అయ్యాడు. తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లపై, నిరాధార ఆరోపణలపై లీగల్ గా వెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. తానూ ఈ బంధం నుంచి బయటకు వచ్చి మూవ్ ఆన్ అవుతున్నట్లు చెప్పాడు. మొత్తానికి ఒక అద్భుతమైన ప్రేమకథ సోషల్ మీడియా సాక్షిగా ముగిసిపోయింది. ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంట ఇలా విడిపోవడం ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు. స్మృతి ఇప్పుడు పూర్తిగా క్రికెట్ పైనే ఫోకస్ పెట్టి, జనవరిలో జరిగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం సిద్ధమవుతోంది.